https://oktelugu.com/

ABN RK – Gaddar : ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే: నీ సన్న బియ్యం పాడుగాను.. ఉన్న బియ్యమే పోయినాయి

ఆర్కే వేసిన ప్రతి ప్రశ్నకు తనదైన తీరులో సమాధానం చెప్పాడు. ప్రోమో రసవత్తరంగా కనిపిస్తుంటే.. ఇక పూర్తి ఎపిసోడ్ ఎలా ఉందో చూస్తే కానీ తెలియదు..

Written By:
  • Rocky
  • , Updated On : April 30, 2023 / 11:57 AM IST
    Follow us on

    ABN RK – Gaddar :  ప్రతివారం సమాజంలో విభిన్నమైన వ్యక్తులతో ఇంటర్వ్యూ నిర్వహించి సంచలన నిజాలు బయటపెట్టే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ఈ ఆదివారం ప్రజా యుద్ధనౌక గద్దర్ తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగి గద్దర్ ద్వారా సమాధానాలు రాబట్టారు. ఆర్కే అడిగిన ప్రశ్నలకు గద్దర్ ఎటువంటి మొహమాటం లేకుండా సమాధానాలు సూటిగా, స్పష్టంగా చెప్పారు.

    ఉన్న బియ్యం పోయినాయి
    “తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రజలందరికీ సన్నబియ్యం ఇస్తానని చెప్పాడు. సన్న బియ్యం మాటేమిటో గాని ఉన్న బియ్యం లాక్కున్నాడు. మావోయిస్టు తరహా పాలన అందిస్తామని చెప్పిన ఆయన, నయా ఫ్యూడలిస్టులాగా మారాడు.. ఇలాంటి తెలంగాణను మేం కోరుకోలేదు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే తెలిస్తే బాగుండేది” అంటూ గద్దర్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. నాడు దొర ఏందిరో, దొర పీకుడేందిరో అని పాడితే, కెసిఆర్ మాత్రం గద్దర్ ఏందీరో, గద్దర్ పీకుడేందిరో అనే స్థాయిలో పాడుతున్నాడని ఆర్కే అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
    ఇదా కోరుకున్న తెలంగాణ?
    “తెలంగాణ ప్రజలు కోరుకున్న రాష్ట్రం ఇది కాదు. ఇలాంటి రాష్ట్రమే వారికి కావాల్సి ఉంటే ఉద్యమం చేసేవారు కాదు. ఉద్యమంలో ఏనాడూ పిడికిలి ఎత్తని, గొంతు నిండా నినాదం పలకని వ్యక్తులు తెలంగాణ ప్రజలను పాలిస్తుంటే దాన్ని ఏమనుకోవాలి? సొంత గడ్డమీద పుట్టిన వాడే మనల్ని బానిసలను చేస్తూ పరాయి వాళ్లకు వంత పాడుతుంటే అంతకు మించిన బాధ ఏమంటుంది? ఇది సామాజిక తెలంగాణ ఎలా అవుతుంది? తెలంగాణ ఒక పార్టీకో, ఒక కుటుంబానికి చెందిన సొంత ఆస్తి కాదు కదా?” అని గద్దర్ పలు విషయాల మీద స్పష్టంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ వాదిగా ప్రజలకు ఏం కావాలో తెలుసుకోకపోవడం కెసిఆర్ చేసిన అతి పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు.
    ప్రజల వాంఛ తీరలేదు
    “తెలంగాణ ఉద్యమం అనేది దశాబ్దాల క్రితం నాటిది. ప్రజల వాంఛలు నెరవేరక వారు ఉద్యమ పంథాను ఎంచుకున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇన్ని పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ లో ప్రజల వాంఛ నెరవేరలేదు. కేవలం దొరల వాంఛ మాత్రమే నెరవేరింది.  సొంత బలం మీద నమ్మకం లేక ఇతర పార్టీలో గెలిచిన వారిని తీసుకువచ్చి తన పార్టీలో చేర్పించుకుంటున్నాడు. ఇంతకు మించిన దౌర్భాగ్యం తెలంగాణకు ఇంకోటి ఏముందని” గద్దర్ సూటిగా ప్రశ్నించాడు.. కెసిఆర్ కి వ్యతిరేకంగా నిలబడి చాలా ప్రశ్నలు, పాటలు పాడాల్సి ఉందని ఈ ప్రజా యుద్ధనౌక స్పష్టం చేశాడు.. అయితే ఆ అవకాశం తనకు కేసీఆర్ ఇస్తాడా అనే అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ఇవే కాదు ఆర్కే వేసిన ప్రతి ప్రశ్నకు తనదైన తీరులో సమాధానం చెప్పాడు. ప్రోమో రసవత్తరంగా కనిపిస్తుంటే.. ఇక పూర్తి ఎపిసోడ్ ఎలా ఉందో చూస్తే కానీ తెలియదు.. మొత్తానికి అటు జగన్, ఇటు కెసిఆర్ వ్యతిరేకులతో ఓపెన్ హార్ట్ నిర్వహిస్తున్న ఆర్కే.. తన మిత్రుడిలో మరింత సెగ కలిగిస్తున్నాడు.