తెలంగాణలో నేడు కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1009కు చేరిందని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పెట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు కొత్తగా నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా 42 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 374గా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 610 మంది ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
ఇదే విషయంపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు తెలుస్తోందని సీఎం అన్నారు. కరోనా వైరస్ పై చేస్తున్న యుద్దంలో విజయ దుందుభి మోగించేంకు సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు తెలంగాణలో కేవలం 6 కొత్త కేసులు మాత్రమే నమోదు కావడం పట్ల అంతా ఊపిరి పీల్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల వంటి పది జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.