మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు పిటిషన్లపై హైకోర్టులో రేపుకూడా జరగనున్న విచారణ జరగనుంది. మంగళవారం నిమ్మగడ్డ తరపు న్యాయవాదితోపాటు పలువురు పిటిషనర్ల తరపు వాదనలు విన్న ధర్మాసనం మరికొందరి వాదనలు రేపు వినాలని నిర్ణయించింది. తుది విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇవాళ పిటిషనర్ల వాదలను సుదీర్ఘంగా విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి, హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణ లతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. నిమ్మగడ్డ రమేష్ తరపున వాదనలు సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, అశ్వనికుమార్ వినిపించారు. ఆర్డినెన్స్ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడే ఇస్తారని తెలిపారు.
ఎస్ఈసీ నియామకంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిమ్మగడ్డకు వర్తించదని ధర్మాసనానికి న్యాయవాది డీవీ సీతారామమూర్తి తెలిపారు. పిల్ ను ఎందుకు అనుమతించాలో చెప్పాలని మరో లాయర్ వెంకటరమణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నిమ్మగడ్డను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం కనుక పిల్ ను అనుమతించాలని న్యాయవాది వెంకట రమణ సమాధానమిచ్చారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆయన కులం ప్రస్తావన తీసుకురావడం, ఆయన కుమార్తెకు చంద్రబాబు ఉద్యోగం ఇచ్చారని సీఎం సహా మంత్రులు మాట్లాడటాన్ని తనవాదనలో లాయర్ డి.ఎస్.ఎన్.వి ప్రసాద్ వినిపించారు. మంత్రి వర్గాన్ని తొమ్మిదోపార్టీగా చేర్చి వారు ప్రెస్‌మీట్‌లలో నిమ్మగడ్డపై చేసిన వ్యాఖ్యలు, టీవీ న్యూస్ క్లిప్పింగ్స్, పేపర్ కటింగ్‌లను అదనపు సాక్ష్యాలుగా పరిగణించాలని ప్రసాద్ కోరారు. గవర్నర్‌కు తప్పుడు సమాచారం అందించారని చెప్పారు.