Homeఆంధ్రప్రదేశ్‌TDP ZPTC Candidate: ఉత్తరాంధ్రలో ఒకేఒక్కడు..మూడు జిల్లాల్లో టీడీపీకి ఏకైక జడ్పీటీసీ

TDP ZPTC Candidate: ఉత్తరాంధ్రలో ఒకేఒక్కడు..మూడు జిల్లాల్లో టీడీపీకి ఏకైక జడ్పీటీసీ

TDP ZPTC Candidate:  నాలుగు దశాబ్దాల పార్టీ అది. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా చెరగని ముద్ర ఆ పార్టీ సొంతం. గతమెంతో వైభవం. ప్రస్తుతం మాత్రం గడ్డుకాలం ఎదుర్కొంటోంది. అదే తెలుగుదేశం పార్టీ. అధికార పార్టీ దూకుడును ఎదుర్కొనలేక నిస్తేజం అలుముకుంది ఆ పార్టీలో. చివరకు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోలేక సైలెంట్ అయ్యింది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ పార్టీకి ఆశాదీపంలా వెలుగు చూపింది శ్రీకాకుళం జిల్లా హిరమండలం జడ్పీటీసీ ఎన్నిక. గెలుపు రుచి చూపింది. టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన పొగిరి బుచ్చిబాబు జడ్పీటీసీగా విజయం సాధించారు. జిల్లా పరిషత్ లో ఏకైక టీడీపీ సభ్యుడిగా అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

TDP ZPTC Candidate
TDP

అటు 35 నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రలో ఒకే ఒక్క టీడీపీ జడ్పీటీసీ సభ్యుడు ఈయన ఒక్కరే. వంశధార నిర్వాసిత యువకుడిగా, ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్ఛిన బుచ్చిబాబు విజయం సాధారణమైనేదేమీ కాదు. వైసీపీ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు రెడ్డి శ్రవణ్ కుమార్ బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థికి అర్ధబలం, అంగ బలం, ఆపై అధికార బలం ఉన్నా.. బుచ్చిబాబు విజయం వెనుక మాత్రం ఉన్నది ముమ్మాటికీ వంశధార నిర్వాసితులే. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు, నిన్న జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు నిర్వాసితుల మద్దతే కారణం అనడం ఎలాంటి అతిశయోక్తి కాదు. అంతలా బలీయమైన శక్తిలా ఎదిగారు వంశధార నిర్వాసితులు. రాజకీయ పార్టీల గెలుపోటములను శాసించే స్థాయికి చేరుకున్నారు. తమ త్యాగాలను విలువనివ్వని పార్టీలకు రాజకీయ సమాధి కట్టగలరు. తమపై వరాల జల్లు కురిపించే వారికి అక్కున చేర్చుకోలగరు.

టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు అన్యాయం చేసిందని నమ్మించడంలో వైసీపీ విజయవంతం కావడంతో ఆ పార్టీకి గత ఎన్నికల్లో మైలేజ్ వచ్చింది. అదే గెలుపునకు దోహదపడింది. అయితే అదే ప్రచారం ఇప్పుడు వైసీపీకి ప్రతిబంధకంగా మారింది. వైసీపీ ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదన్న వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే నిర్వాసితులు గ్రహిస్తున్నారు. దాని ప్రభావమే హిరమండలం జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు విజయం.

Also Read: Yerrannaidu Childrens Park: ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్కును ధ్వంసం చేసిందెవరు? దాని వెనుక ఉన్న కథ ఏంటి?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక వంశధార ఫేజ్2 రిజర్వాయర్ నిర్మాణం. వంశధార మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లకుండా ఒడిసి పట్టుకునేందుకు రిజర్వాయర్ నిర్మాణానికి సంకల్పించారు. హిరమండలం, కొత్తూరు మండలాల్లో 18 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మిగిలారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెరుగైన ప్యాకేజీ, పరిహారం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పూర్వీకుల కాలం నుంచి నివాసముంటున్న గ్రామాలను, చిర, స్తిర ఆస్తులను విడిచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. రిజర్వాయర్ నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి.

Vamsadhara River

ఇంతలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందారు. దీంతో ఆ నిర్వాసితులకు తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రిజర్వాయర్ నిర్మాణ పనులు సైతం నత్తనడకన సాగాయి. నిధులు లేమితో సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వంశధార రిజర్వాయర్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. నిర్వాసితులకు ప్యాకేజీ, పరిహారం కింద రూ.480 కోట్లు విడుదల చేసింది. అదే సమయంలో రిజర్వాయర్ నిర్మాణ పనులు శర వేగంగా చేయించింది. కానీ విపక్ష వైసీపీ మాత్రం నిర్వాసితుల్లో అనుమానాలను పెంచింది. తాము అధికారంలోకి వస్తే 2013 భూ పరిహారం చట్టం కింద పరిహారం చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. పరిహారం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. పైగా టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులను దగా చేసిందని చెప్పుకొచ్చింది. ఈ మాటలను నమ్మిన నిర్వాసితులు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు పలికారు.

ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కానీ ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో నిర్వాసితుల సమస్యలు ఒక్కటంటే ఒక్క సమస్య పరిష్కారానికి నోచులేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం పట్ల వారికున్న భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబును గెలిపించారు. అయితే అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకోలేకపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సరైన టైములో హిరమండలం జడ్పీటీసీ గెలుపు రూపంలో మైలేజ్ వచ్చినా నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని హిరమండలం జడ్పీటీసీ గెలుపును రాష్ట్ర స్థాయిలో చూపించలేకపోయారన్న అపవాదు ఉంది. కేవలం రాజకీయ కోణంలో ఆలోచించే అచ్చెన్న ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టు అరోపణలు వస్తున్నాయి.

Also Read: Venkaiah Naidu Suresh Gopi: పార్లమెంట్ లో సురేష్ గోపీ గడ్డంపై వెంకయ్యనాయుడు సెటైర్ కు నవ్వులే నవ్వులు

RELATED ARTICLES

Most Popular