చదువుల విషయంలో జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాల్లో తెలుగు మీడియాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సంవత్సరం నుంచి డిగ్రీ చదివేవాళ్లంతా ఇంగ్లీషులోనే చదవాలన్నమాట. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలన్నీ ఇంగ్లీషులోకి మారాల్సి ఉంటుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ విషయాన్ని ప్రకటించింది.
ఇందుకు సంబంధించి కాలేజీలన్నీ సిద్ధం కావాలని, మాద్యమం మార్పునకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. ఇందుకు ఈ నెల 18 నుంచి 28 వరకు గడువు విధించింది. ఈ ప్రతిపాదనలు సమర్పించకపోతే ఆ కాలేజీల్లో డిగ్రీ కోర్సులను నిర్వహించే అవకాశం లేదని హెచ్చరించింది.
ఈ విషయంలో సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏ మీడియంలో చదవాలనేది విద్యార్థుల ఇష్టమని, ప్రభుత్వం బలవంతంగా రుద్దడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది వరకు రెండు మాద్యమాలు అమల్లో ఉన్నాయి. దీనివల్ల విద్యార్థులు తమకు నచ్చిన మాద్యమాన్ని ఎంచుకున్నారు.
రాష్ట్రంలో ఉన్న 1336 డిగ్రీ కాలేజీల్లో గతేడాది మొత్తం 2.60 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఇందులో 65,981 మంది విద్యార్థులు తెలుగు మాద్యమంలో చేరారు. మిగిలిన వారు తమ ఇష్టానుసారం ఇంగ్లీష్ మీడియంలో చేరారు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తే.. పోయేది ఏముందని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే పాఠశాల విద్య విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు డిగ్రీ విషయంలోనూ ఇదే తీరుగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నట్టుండి ఇంగ్లీష్ మీడియంలో చేరాలంటే.. విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అప్పటి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నవారు ఒక్కసారిగా ఇంగ్లీష్ మాధ్యమంలో ఎలా చదువుకుంటారని అడుగుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు.. ఇలా ఎవ్వరితోనూ చర్చించకుండా ప్రభుత్వం ఉన్నఫలంగా ఇలా వ్యవహరించడం నష్టం కలిగిస్తుంది తప్ప, లాభం లేదని అంటున్నారు. మరి, దీనికి జగన్ సర్కారు ఎలాంటి సమాధానం చెబుతుందన్నది చూడాలి.