Mancherial: కేసీఆర్ వస్తే అంతే.. ఇంట్లో పెళ్లి కూడా ఆపేయాల్సిందే.. ఇదేం దారుణం?

ఆడపిల్ల ఇంట్లో పెళ్లంటే మాటలా! హడావిడి ఉంటుంది. నారాయణ ఇంట్లో కూడా ఇలాంటి సందడి నెలకొంది..నగలు, కొత్తబట్టల కొనుగోలు.. క్యాటరింగ్‌, ఫంక్షన్‌ హాల్‌, మగపెళ్లి వారికి విడిది, విందు ఏర్పాట్లలో అతని కుటుంబం తల మునకలు అయ్యింది.

Written By: Bhaskar, Updated On : June 2, 2023 11:07 am
Follow us on

Mancherial: అది మంచిర్యాల జిల్లా. నస్పూర్ గ్రామం. ఆ గ్రామంలో పోతు సత్యనారాయణ అనే వ్యక్తి జీవిస్తుంటాడు. సత్యనారాయణ సింగరేణి ఆర్కే_5బీ గని లో సపోర్టు మెన్ గా చేస్తుంటాడు. ఈయనకు భార్య, ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. అమ్మాయికి ఇటీవల పెళ్లి ఖరారయింది. అయితే ఆమె పెళ్లి కోసం సత్యనారాయణ అన్ని ఏర్పాట్లు చేశాడు. జూన్ 9 న ఏడు గంటల 41 నిమిషాలకు వివాహం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ క్రమంలోనే తాను పనిచేస్తున్న శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి సంస్థకు చెందిన సిసిసి లోని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాడు. రసీదు కూడా తీసుకున్నాడు.. ఇక్కడే అసలు కథ మొదలైంది.

సార్ వస్తున్నారు

ఆడపిల్ల ఇంట్లో పెళ్లంటే మాటలా! హడావిడి ఉంటుంది. నారాయణ ఇంట్లో కూడా ఇలాంటి సందడి నెలకొంది..నగలు, కొత్తబట్టల కొనుగోలు.. క్యాటరింగ్‌, ఫంక్షన్‌ హాల్‌, మగపెళ్లి వారికి విడిది, విందు ఏర్పాట్లలో అతని కుటుంబం తల మునకలు అయ్యింది. సత్యనారాయణ నెలరోజులుగా ఈ పనుల్లోనే బిజీ ఉన్నారు..మరో ఏడు రోజుల్లో రోజుల్లో పెళ్లనగా ఆయనకు తాను బుక్‌ చేసిన ఫంక్షన్‌ హాల్‌ నుంచి ఫోనొచ్చింది. ‘సీఎం కేసీఆర్‌ వస్తున్నారు.. మీకు ఫంక్షన్‌ హాల్‌ ఇవ్వలేం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి’ అనేది ఆ ఫోన్‌ కాల్‌ సారాంశం. అంతే.. ఏం చేయాలో అర్థం కాక సత్యనారాయణ తీవ్ర ఆందోళనలో పడిపోయారు. వాస్తవానికి సత్యనారాయణ సింగరేణి ఆర్కే-5బి గనిలో సపోర్టుమన్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు శిరీష వివాహం జూన్‌ 9న ఉదయం 7:41 గంటలకు నిశ్చయించారు. వివాహ వేదిక కోసం తాను పనిచేస్తున్న శ్రీరాంపూర్‌ ఏరియాలోని సంస్థకు చెందిన సీసీసీలోని సింగరేణి గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌ను బుక్‌ చేశారు. సంస్థ నిర్ణయించిన రుసుము చెల్లించి, రసీదు తీసుకున్నారు. అప్పటి నుంచే ఆయన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే మంగళవారం ఉదయం సింగరేణి అధికారులు ఫోన్‌ చేసి జూన్‌ 9న సీఎం పర్యటన ఉందని, తాము ఫంక్షన్‌ హాలు ఇవ్వలేమని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సత్యానారాయణకు చెప్పారు. అవాక్కయిన వధువు తండ్రి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఇప్పటికే శుభలేఖలు పంచడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

సీఎం రాక సందర్భంగా..

సీఎం రాక సందర్భంగా నెల రోజులు ముందుగా బుక్‌ చేసిన ఫంక్షన్‌ హాలును రద్దు చేసిన సింగరేణి అధికారుల తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ 9న ఎక్కువగా పెళ్లిళ్లు ఉండటంతో సీసీసీ, శ్రీరాంపూర్‌లలోని సింగరేణికి చెందిన అన్ని ఫంక్షన్‌ హాళ్లు బుక్‌ అయినట్లు సమాచారం. సీఎం పర్యటన సందర్భంగా వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చినప్పుడల్లా సింగరేణి అధికారులు ఇలానే వ్యవహరిస్తున్నారు. పైగా ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఈ ప్రాంతం మొత్తం మంచిర్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ జిల్లా కలెక్టరేట్, భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయం ప్రారంభించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే మొదట్లో కేవలం ప్రారంభోత్సవం మాత్రమే చేస్తారని అనుకున్నారు. బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడంతో గత్యంతరం లేక సింగరేణి అధికారులు తమ ఫంక్షన్ హాల్స్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చారు. దీంతో ఆ రోజు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్న వారందరికీ ఇవ్వలేము అని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఫలితంగా సత్యనారాయణ లాంటి తండ్రులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలో తెలియక మదన పడుతున్నారు.