https://oktelugu.com/

Ola restrooms : ఈ టెక్నాలజీ యుగంలో మనిషి జీవితం మారిపోయింది.. అత్యవసరం కూడా ఆన్ లైన్ అయిపోయింది..

అడుగు బయట పెట్టే పనిలేదు. జస్ట్ ఒక్క క్లిక్ దూరంలోనే.. అందులోనే మనిషి కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. తినే తిండి.. తాగే నీరు.. వండుకునే వంటలు.. వేసుకునే బట్టలు.. ఇలా ప్రతి ఒక్కటీ ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 26, 2024 / 03:15 PM IST

    OLa Restrooms

    Follow us on

    ola restrooms : టెక్నాలజీ సృష్టించిన విప్లవం వల్ల మనిషి జీవితం లిరిక్ లేని సంగీతం అయిపోయింది. ప్రతిరోజు ఉరుకులు పరుగులు.. సాటి మనిషితో రెండు నిమిషాలు మాట్లాడలేనంత బిజీ.. ఏ పని కావాలన్నా అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ చేసిపెడుతోంది.. అన్ని కాళ్ళ ముందుకు తెచ్చిపెడుతోంది. ఒకప్పుడు ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ అంటేనే చాలామంది నొసలు చిట్లించారు. ఆన్లైన్ ఫుడ్ నుంచి మొదలు పెడితే ఆన్లైన్ గ్రాసరీ వరకు అది విస్తరించింది. ఆ తర్వాత ఆన్లైన్ టాక్సీ.. ఆన్లైన్ మెడిసిన్.. ఆన్లైన్ మద్యం.. ఇలా అనేక పుంతలు తొక్కింది. అయితే ఇది ఎక్కడిదాకా వెళ్తుందో ఇప్పటికైతే చెప్పలేం గాని.. ఒక మనిషి జీవితానికి సంబంధించిన అన్నింటిని ఆన్లైన్ ప్రభావితం చేస్తోంది. తినే తిండి, తాగే నీరు, వేసుకునే మందులు, కాస్త ఉపశమనం కోసం సేవించే మద్యం.. ఇలా ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ఇటీవల కొన్ని ప్రైవేట్ సంస్థలయితే ఏకంగా ఆన్లైన్లోనే నిత్యవసరాలను సరఫరా చేస్తున్నాయి. ఇటీవల ఓ పాల తయారీ సంస్థ యాప్ లో బుక్ చేసుకుంటే చాలు మీ ఇంటికే మిల్క్ తీసుకొస్తామని ఆఫర్ ప్రకటించింది. చివరికి మాంసం కూడా ఆన్లైన్ డెలివరీ సరుకుల్లో చేరిపోయింది. ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడి మనిషి కుదురుగా లేకపోవడం.. ఏ చిన్న విషయానికి కూడా సమయం వెచ్చించలేకపోవడం వల్ల ఆన్లైన్ అనేది అత్యవసరంగా మారిపోయింది..

    అత్యవసరాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు

    మనదేశంలో ఓలా అనే సంస్థ ఆన్లైన్ టాక్సీ లను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ సేవలందిస్తోంది. ఇటీవల గ్రాసరి విభాగంలోకి వచ్చింది. కొన్ని ప్రాంతాలలో ఫుడ్ సర్వీసులు కూడా అందిస్తోంది. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని వ్యాపారం లోకి వచ్చింది. సాధారణంగా మనము ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు అత్యవసరంగా ఒకటి గాని రెండు గాని వస్తే వెంటనే బాత్ రూమ్ లు ఎక్కడ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ బాత్ రూం లు లేకపోతే నరకం చూస్తాం. ఆ సమయంలో ఆ బాధ భరించలేనిది. అదే అటువంటి సమయంలో మేమున్నామంటూ ఓలా ముందుకు వచ్చింది. అత్యవసరమైన రెస్ట్ రూం పేరుతో ఒక సర్వీస్ ప్రారంభించింది. ఇందులో ఒంటికి, రెంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. కడుపు ఉబ్బరాన్ని.. ఉదర భారాన్ని తగ్గించుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. అయితే వాస్తవానికి మనదేశంలో ఇలాంటి సర్వీసులు ఇంతవరకు ఏ కంపెనీ అందుబాటులోకి తేలేదు. అయితే ఈ సర్వీస్ ను తాము అందుబాటులోకి తెచ్చామని ఓలా సగర్వంగా చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రకటనను కూడా వినూత్నంగా రూపొందించింది. మెట్రో, కాస్మోపాలిటన్, టైర్ -1 సిటీస్లో ఈ సౌకర్యాన్ని ఓలా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇది కూడా ఆన్లైన్ కావడంతో చాలామంది నొసలు చిట్లిస్తున్నారు. మనిషి జీవితం ఎంత బిజీగా మారుతుందో.. అదే స్థాయిలో కొత్త కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని.. ఇలాంటివి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ.. మనిషి ఏం కోల్పోతున్నాడో చెబుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.