YCP: విశాఖపై వాలిపోయారు.. మరో భారీ భూ స్కాంకు చెక్

విశాఖపట్నం అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇక్కడ ప్రభుత్వ భూములు అధికంగా ఉండడంతో.. వివిధ అవసరాల పేరిట వాటిని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తుండడం విశేషం.

Written By: Dharma, Updated On : November 10, 2023 9:08 am

YCP

Follow us on

YCP: ఎన్నికల ముంగిట వైసీపీ నేతలకు భూసంతర్పణ కొనసాగుతోంది. అడ్డగోలుగా వైసీపీ నేతల కుటుంబ సభ్యులకు అధికారులు భూములు కట్టబెడుతున్నారు. తాజాగా విశాఖలో అటువంటి ఘటన వెలుగు చూసింది. టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడికి దాదాపు 15 కోట్ల రూపాయల భూమిని కేటాయించడానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

విశాఖపట్నం అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇక్కడ ప్రభుత్వ భూములు అధికంగా ఉండడంతో.. వివిధ అవసరాల పేరిట వాటిని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తుండడం విశేషం. కొద్దిరోజుల కిందట విజయ్ సాయి రెడ్డి కుమార్తె పేరుతో ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆనందపురం మండలం తర్లువాడలోని ఓ కొండను పరిశీలించిన సంగతి తెలిసిందే. అది మరువక ముందే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యాసంస్థకు ప్రభుత్వ భూమి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. వాసుపల్లి తన సంస్థ తరఫున విద్యాసంస్థలను నెలకొల్పేందుకు అనువైన ప్రభుత్వ భూములను మార్కెట్ విలువ ఆధారంగా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కుసులువాడ పరిధిలోనే సర్వే నంబర్ 59లో 7.60 ఎకరాలను ఎంచుకున్నారు. విజయనగరం- నేల కుండీల రోడ్డు సమీపంలో ఈ భూమి ఉంది. ఈ భూమి ఎక్కడ మార్కెట్ ధర రూ. 17 లక్షలు. బహిరంగ మార్కెట్లో మాత్రం రెండు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనిపై వాసుపల్లి ప్రభుత్వ పెద్దలతో జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా పావులు కదిపినట్లు సమాచారం. ఆనందపురం తహసిల్దార్ కార్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేసి… భీమిలి ఆర్డిఓ ద్వారా కలెక్టరేట్ కు పంపారు. అక్కడి అధికారులు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపారు. మంత్రివర్గ ఆమోదం లభించాక కేటాయింపుల ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది.

వాసుపల్లి గణేష్ కుమార్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకుడిగా అందరికీ సుపరిచితులు. గత మూడు దశాబ్దాలుగా డిఫెన్స్ అకాడమీ ని నడుపుతూ వస్తున్నారు. అయితే ఇక్కడే భూమి కోరుకోవడం వెనుక పెద్ద కథ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థలానికి అతి సమీపంలోనే గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం దాదాపు 300 ఎకరాల భూమిని కేటాయించింది. డిఫెన్స్ అకాడమీ కావడంతో.. గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థకు కూత వేటు దూరంలో ఉంటే… వ్యాపారం లాభసాటిగా మారుతుందని గణేష్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే శరవేగంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఈ ఫైల్ కు అధికారులు పెద్దపీట వేసినట్లు సమాచారం.

2019 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొద్దిరోజులకి వైసీపీలోకి ఫిరాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు చెందిన విద్యాసంస్థలపై దాడులు జరిగాయి. ఆ పరిణామాల క్రమంలోనే ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన విద్యాసంస్థకు విలువైన భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖలో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలకు సంతర్పించడంపై చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.