ఆయుర్వేద మందుపై రోజుకో కథనాలు వినిపిస్తున్నాయి. ఓ రోజు ఆనందయ్య మందు విషయంలో బాగుందని, మరో రోజు మందు నాణ్యతపై అనుమానాలున్నాయని చెబుతూ విభిన్న కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. మంగళవారం టీడీపీ ప్రతినిధుల బృందం సభ్యులు మందు తీరును పరిశీలించి ప్రశంసించారు. కానీ మందు పనితీరు గురించి పలు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆయుర్వేద మందుపై కేంద్ర ఆయుర్వేద వైజానిక పరిశోధన మండలి (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, సీసీఆర్ఏఎన్) చేపట్టిన అధ్యయనానికి ఆదిలోనే అవాంతరాలు ఏర్పడుతున్నాయి.
మందు స్వీకరించిన వారి అభిప్రాయాలు, వైద్య నివేదికలు సేకరించాలనుకున్న సీసీఆర్ఏఎన్ ఆ బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థతో పాటు తిరుపతి ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాలకు అప్పగించింది. తొలిదశలో 500 మంది నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ద్వారా ఔషధం పనితీరుపై ఓ అంచనాకు రావాలని భావించారు.
ఈ రెండు సంస్థల సిబ్బంది తమకు అందిన సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా రోగులు, వారి బంధువులకు సోమవారం నుంచి ఫోన్ చేశారు. జాబితాలోని 92 మందికి ఫోన్ చేసినా స్పందించలేదు.42 మంది తామే అసలు మందు తీసుకోలేదని చెప్పారు. మరో 36 మంది ఒకే నెంబర్ ఇచ్చారు. ఔషధం తీసుకున్నట్లు చెబుతున్న వారిలోనూ అనేక మంది వైరస్ రాకుండా ముందు జాగ్రత్తగా వేసుకున్నామన్నారు. ఇంకొందరు కొవిడ్ బారిన పడిన తరువాత తీసుకున్నా సంతృప్తికరంగా వివరాలు చెప్పలేదు.
ప్రభుత్వానికి ఎలా నివేదించాలని ఆయుర్వేద సంస్థల అధికారులు మీమాంసలో పడిపోయారు. మరింత మంది ఫోన్ నెంబర్లు పంపించాల్సిందిగా అధికారులను కోరారు. ఆనందయ్య దగ్గర సుమారు 70 వేల మంది ఔషధం తీసుకున్నట్లు పోలీసు వర్గాల అంచనా. తన వద్దకు వచ్చిన వారి నుంచి ఆయన ఎ లాంటి వివరాలు సేకరించలేదు. ఇంకా కొందరిని విచారిస్తే గానీ స్పష్టత రాదని అధికారులు పేర్కొన్నారు. ఆనందయ్య మందుపై దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు ఈనెల 27న విచారించనుంది.