
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు లాక్‌డౌన్ గండం ఏర్పడింది. మొత్తం 17 రాష్ట్రాల నుండి 55 మంది సభ్యులకు ఎన్నికలు జరుగగా, వారిలో 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాధారణంగా వారు ఈ రోజు ప్రమాణస్వీకారం చేయవలసి ఉంది.
అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు. లాక్‌డౌన్ పూర్తయితే గాని వారి ప్రమాణస్వీకారం ఉండబోదని సంకేతం ఇచ్చారు.
‘ప్రమాణస్వీకారానికి గాను నూతనంగా ఎన్నికైన సభ్యులను లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాం’ అని రాజ్యసభ చైర్మన్ ఒక అడ్వైజరీలో సూచించారు.
మరోవంక, పోటీ ఏర్పడిన మిగిలిన 18 మంది సభ్యుల కోసం గత నెల 26న జరుగ వలసిన ఎన్నికలను సహితం ఇదే కారణంతో ఎన్నికల కమీషన్ వాయిదా వేయడం తెలిసింది. ఈ ఎన్నికలు సహితం లాక్‌డౌన్ సంగతి తేలితే గాని జరిగే అవకాశం లేదు.
అయితే కొత్తగా ఎన్నికైన వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన జీతభత్యాలన్నీ వారు ఎన్నికైనట్లు ప్రకటించిన నాటి నుంచి వర్తిస్తాయని అధికారులు తెలపడంతో వారికి కొంత ఉపశమనం కలిగిన్నట్లు అయింది.