
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి కార్మికులకు సహితం లాక్ డౌన్ కారణంగా సగం మేరకు జీతాలకు కొత్త విధిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాలు జారీచేయడం పెను వివాదంగా మారుతున్నది. అక్కడున్న గుర్తింపు పొందిన కార్మిక సంఘం అధికార పార్టీకి చెందినది కావడంతో అధికారికంగా వారు నోరు మెదపడం లేదు. అయితే మిగిలిన కోరిక సంఘాలు ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నాయి.
సింగరేణి కాలరీస్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్ కాదని, స్వతంత్ర ప్రతిపత్తి గల కార్పొరేట్ సంస్థ అని, దీని ఉద్యోగుల జీతాలతో కొత్త విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై రాజ్యాంగ సంస్థలలో ఫిర్యాదు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం ఒక వంక చేస్తున్నారు. మరో వంక సమ్మె నోటీసు ఇవ్వడానికి కూడా సిద్దపడుతున్నారు.
120 సంవత్సర సింగరేణి చరిత్రలో మొదటిసారిగా ఇటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం సంస్థలో చీకటి రోజని
సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) విమర్శించింది. తమ కార్మికుల జీతభత్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదని, సంస్థకు రాష్ట్ర బడ్జెట్ తో కూడా సంబంధం లేదని కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి పి మాధవ్ నాయక్ స్పష్టం చేశారు.
పైగా, రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు సింగరేణి సంస్థనే రాయల్టీ టాక్స్ పేరుతో చెలిస్తుందని చెబుతూ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మెప్పు పొందడానికే సింగరేణి కార్మికుల జీవితంతో ఆటలు ఆడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, వైద్య శాఖలకు పూర్తిగా జితం ఇస్తూ, ప్రోత్సాహాలు కూడా ఇస్తామని ప్రకటించి తమ జీతాలతో కొత్త విధించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు..
వేతనాలు తగ్గించడం లేదా తక్కువ ఇచ్చే పరిస్థితి నిజంగా కంపెనీకి ఉంటే ముందుగా గుర్తింపు యూనియన్, రిప్రజెంటేటివ్ యూనియన్ లతో యజమాన్యము మాట్లాడి, తగు కారణాలు చెప్పి, వాళ్ళ తో ఒక ఒప్పందం చేసుకోవాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. కార్మిక చట్టం ప్రకారం సగం జీతాలు ఇవ్వడం నేరం కాగలదని హెచ్చరిస్తున్నాయి.
సింగరేణి యాజమాన్యం, యాజమాన్య సంఘం ఇద్దరు కలిసి ఈరోజు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సింగరేణిలో లే ఆఫ్ బదులు లాక్ డౌన్ ప్రకటించాలని, కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 14లోగా సమస్యలను పరిష్కరించని పక్షంలో 15 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. ఈ మేరకు సింగరేణి సీఎండీకి సమ్మె నోటీస్ ఇచ్చినట్లు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ ప్రకటించాయి