Jagan Sharmila: లేడికి లేచిందే పరుగు అన్నట్టుంది సీఎం జగన్ తీరు. ఏపీ కేబినెట్ మీటింగ్ ఆన్ లైన్ లో జరిగిందట.. అందరూ పడుకున్నాక వీరు చేసిన రహస్య మీటింగ్ లో సడెన్ గా ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరును ‘వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ’గా మార్చేశాడు జగన్. ఈ నిర్ణయాన్ని సొంత వైసీపీ నేతలు కూడా జీర్ణించుకోవడం లేదు. జగన్ ను పొగడడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే అందరికీ అభిమానం. టీడీపీలో ఎదిగిన వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు దీనిపై పునరాలోచించాలని కోరారంటే జగన్ అర్థం చేసుకోవచ్చు. జగన్ అంటే ప్రాణమిచ్చే వారే ఆయన నిర్ణయాన్ని తప్పు పడుతున్న పరిస్థితి నెలకొంది.

జగన్ నిర్ణయంతో ఏపీ అధికార భాష సంఘం చైర్మన్ యార్లగడ్డ ఇప్పటికే రాజీనామా చేసిపడేశారు. ఇక జగన్ పై ఈగవాలనీయకుండా కాపు కాసే లక్ష్మీపార్వతి సైతం రాజీనామా బాటపట్టింది. తన భర్త పేరును తీసేసి.. జగన్ తండ్రి పేరు పెట్టడంపై ఆమె కక్కలేక మింగలేక కుతకుతలాడుతోంది. వైసీపీలో కరుడుగట్టిన వారు కూడా ఇది మంచి నిర్ణయం కాదని అంటున్నారు. అయినా కూడా జగన్ ఇంత సడెన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది అంతుబట్టడం లేదు.
జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి.. తనకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి.. ఎవరూ అడిగే వారు లేరని ఇలా రెచ్చిపోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇదే వర్సిటీ పేరును మళ్లీ ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ అని మార్చేస్తారు. అధికారం మారితే ఇలా పేర్లు మార్చడం కరెక్ట్ కాదని స్వయంగా సీఎం జగన్ సొంత చెల్లెలు షర్మిల కూడా కామెంట్ చేయడం సంచలనమైంది.
‘పేర్లు మార్చకూడదు. వాటి గుర్తింపు, విశ్వసనీయత పోతుంది. కారణం ఏదైనా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. ఆ పేరును కంటిన్యూ చేస్తే తరతరాల పాటు వారిని గౌరవించినట్టు ఉంటుంది. కన్ఫ్యూజన్ ను కూడా అవైడ్ చేసినట్టు ఉంటది. ఎవరికి తోచినట్టు వారు పేర్లు పెట్టుకుంటూ పోతే ఎవరు రిఫర్ చేస్తున్నది కూడా అర్థం కాదు. ’ అంటూ అన్న జగన్ నిర్ణయాన్ని చెల్లి తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల సైతం ఖండించారు. పైగా అన్న నిర్ణయంపై ఎద్దేవా చేస్తూ మాట్లాడడం సంచలనమైంది.