NTR Tweet: సీనియర్ ఎన్టీఆర్ కి సినీ వారసుడిగా ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే, రాజకీయాల్లోనూ ఎప్పటికైనా వారసుడు అవుతాడు అని ఆశిస్తున్నారు. అందుకే, టీడీపీ అభిమానులు కూడా సీనియర్ ఎన్టీఆర్ కి నిజమైన వారసుడిగా తారక్ ను భావిస్తారు. అయితే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయడం వివాదాస్పదమైంది.

ఇప్పటికే, ప్రత్యేక జీవో విడుదల చేశారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం.. ఎన్టీఆర్ అభిమానులను కూడా బాగా బాధ పెట్టింది. దీని పై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ క్రమంలో తారక్.. ”ఎన్టీఆర్, వైఎస్సార్ విశేష ప్రజాదరణ కలిగిన గొప్ప నాయకులు’ అంటూ ఒక లైన్ రాశాడు. ఈ లైన్ దగ్గరే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఓ రకంగా తారక్ పై నెగిటివ్ కామెంట్స్ కి కారణం అయింది.
పలువురు నెటిజన్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చూసి సీరియస్ అవుతున్నారు. ఓ నెటిజన్ తారక్ కి మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘ఇద్దరూ గొప్ప నాయకులా ? ఎన్టీఆర్ లాంటి గొప్ప వారితో వైఎస్సార్ ని సమానం చెయ్యడం ఏందయ్యా ?, ప్రజాదారణ ఉన్నొడు అంతా గొప్పోడు అయిపోడు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై సీరియస్ అయ్యాడు.
అలాగే మరో నెటిజన్ ఈ విధంగానే కామెంట్ చేస్తూ.. ‘ఎన్టీఆర్ తో వైఎస్ఆర్ ను పోల్చడం మీకు ఇష్టమేమో గాని, ఎన్టీఆర్ అభిమానులకు కాదు. వైఎస్సార్ స్థాయిని పెంచనప్పుడు, స్థాయి పెరగదు కాబట్టి, ఎన్టీఆర్ పేరే ఉంచాలని, అసలు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి ఆ పేరు ఉండటం, తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పొచ్చుగా? ప్రశ్నించొచ్చుగా ? నిలదీయొచ్చుగా ? ఎందుకు ఈ తికమక సమాధానం ?’ అంటూ తారక్ ను ప్రశ్నించాడు.

అదేవిధంగా మరో నెటిజన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి పోస్ట్ చేస్తూ.. ‘అసలు ఈ విషయం పై స్పందించకుండా ఉన్నా బాగుండేది. లేదా, కేవలం ఎన్టీఆర్ పేరు చెప్పినా సరిపోయేది.. అసలు సీనియర్ ఎన్టీఆర్ గారితో ఆ వ్యక్తి కి పోలిక ఏంటో ?, మళ్ళీ గొప్ప నాయకుడు అనడం ఏంటో.. ?, మా టీడీపీలో కొంత మందే అనుకుంటుంటే, ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా వైఎస్ఆర్ భజన మొదలు పెట్టారు’ అంటూ మరో నెటిజన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
నిజానికి తారక్ చాలా మర్యాదపూర్వకంగా ట్వీట్ చేశాడు. ‘పేరు తీసివేసి ఒకరి పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవంతో వైఎస్సార్ స్థాయి పెరగదు. ఎన్టీఆర్ స్థాయి తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని , తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఆయన జ్ఞాపకాలను చెరిపివేయలేరు’ జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో చాలా మర్యాద ఉంది. అయినా జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు రావడం కొసమెరుపు.