NTR Centenary Celebrations
NTR Centenary Celebrations: మహానటుడు నందమూరి తారకరామారావు 100వ పుట్టినరోజు. ఈ శతజయంతి వేడుకలను ఏడాది పొడవునా జరుపుకోనున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. తెలుగునాట మహానటుడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు నందమూరి తారక రామారావు. ముద్దుగా ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు. తెలుగు సినిమా చరిత్రలో ఇంతకు మించిన పేరు కనిపించదు.. వినిపించదు. రామారావు 1923లో, మే 28న కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. అందరిలాగే కష్టాలు.. కన్నీళ్లు బాధలు దుఃఖాలు అన్ని చవిచూసిన మహానీయుడు రామారావు.
నాటకం అంటే అభిరుచి..
తన పెదనాన్న రామయ్య గారికి నాటకాలంటే మహా ప్రియం. అందుకే ఆయన అభిరుచే ఎన్టీఆర్‌కు అలవడింది. కాలేజీ రోజుల్లో రామరావు అధ్యాపకుడుగా ఉన్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రోత్సాహంతో పలు పాత్రలను నాటకాల్లో పోషించారు. నాయకురాలు నాగమ్మ నాటకం అతనికి మంచి పేరు తీసుకువచ్చింది. తరువాత మిత్రులు జగ్గయ్య, పుండరీకాక్షయ్య తదితరులతో కలిసి ఇబ్బడిముబ్బడిగా నాటకాలు వేసారు.
చదువుపైనా ఆసక్తి..
నాటకాలు వేస్తూనే… చదువుపై కూడా ఆసక్తి చూపారు ఎన్టీఆర్. ఓసారి ఎల్పీ ప్రసాద్ సినిమా అవకాశం ఇస్తానన్నా చదువు తరువాతే నటన అంటూ తోసిరాజన్నారు.
సబ్ రిజిస్ట్రార్‌గా సర్కారు నౌకరీ..
బీఏ పూర్తవగానే సర్కారు నౌకరీ దొరికింది. సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం చేశారు. ఉద్యోగంలో తృప్తి దొరకలేదు. బతుకు దెరువు ఎవరికి కావాలి. మనసుకు తృప్తి దొరకాలి. అదే ఆయన మదిలో మెదిలిన మాట. అంతే రెండు జతల దుస్తులతో చెన్నపట్టణానికి పయనమయ్యారు.
పోలీస్ అధికారిగా తొలి పాత్ర..
అప్పుడే ఎల్వీప్రసాద్ మీర్జాపురం రాజా నిర్మిస్తున్న మనదేశం చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. అందులో చిత్తూరు నాగయ్య, సి.హెచ్.నారాయణరావు నటిస్తున్నారు. మీర్జాపురం రాజా సతీమణి, నటి కృష్ణవేణి అందులో కథానాయికలు. ఈ సినిమాలో ఓ పోలీస్ అధికారి పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఆ తర్వాత పల్లెటూరు పిల్ల సినిమాలో ఏకంగా నందమూరి రామారావునే హీరోని చేశారు.
విశేషం ఏంటంటే… నందమూరి కంటే నాగేశ్వరరావు సీనియర్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో ఆయన కూడా మరో హీరో. ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా విజయం సాధించడంతో ఎన్టీఆర్‌కు తిరుగు లేకుండా పోయింది.
తనలోనే దేవుడిని చూపించి..
తనలోనే దేవుడిని చూపించి అరుదైన నటుటు రామారావు అనిపించుకున్నారు. ఎన్టీఆర్ పేరు చెబితే చాలు తెలుగు గడ్డ పులకించిపోతుంది. వారి హృదయాంతరాలలో ఓ సంబరం మొదలవుతుంది. గుక్కతిప్పుకోని పద్యాలతో చేతులు తిప్పుతూ కనిపించినా, శ్రీకృష్ణునిగా సఖీమణులతో సయ్యాటలాడినా, కర్ణుడిగా దానగుణం కురిపించినా, భీమునిగా బలాబలాలు చూపించినా, శ్రీరాముడిగా భక్తిభావం పండించినా, శ్రీనాధ కవిసార్వభౌమునిగా కవితా పాండిత్యం చూపించినా అలా చేయడం అందరికీ సాధ్యం కాదు అని రుజువు చేసిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్.
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయపార్టీ..
తెరపై మకుటం లేని మహారాజుగా.. వెలుగొందిన ఎన్టీఆర్…. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982, మార్చి 29న పార్టీని స్థాపించిన ఎన్టీఆర్… పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే 1983, జనవరి 9 అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ బలంగా లేకపోవడంతో తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు బ్రహ్మరథం పట్టి… టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు. రాజకీయాల్లోను తనదైన మార్కు చూపించారు. ఓ వైపు సినిమాల్లోను, మరోవైపు రాజకీయాల్లోను చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 1996, జనవరి 18న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన లాంటి వ్యక్తి కాదు శక్తి మరోకరులేరు. ఇంకా చెప్పాలంటే… ఒక భూమి.. ఒక ఆకాశం.. ఒక సూర్యుడు, ఒక చంద్రుడు.. ఒక ఎన్టీఆర్..!
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ntr centenary special story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com