https://oktelugu.com/

72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

ఆగస్టు 5 చరిత్రలో మరపురాని రోజుగా మిగిలిపోతుంది. పోయిన సంవత్సరం ఇదే రోజు ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్ ని భారత్ లో పూర్తిగా మమేకం అయ్యే పునాదులు నిర్మించారు. ఈ సంవత్సరం ఇదే రోజు కోట్లాది హిందువుల మనోభావాలకు అనుగుణంగా రాముని జన్మభూమి లో మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ రెండు చర్యలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేవే. ఈ రెండు పనులు విజయవంతంగా , చాకచక్యంగా చేయటం లో మోడీ నాయకత్వ పటిమను […]

Written By:
  • Ram
  • , Updated On : August 6, 2020 / 05:35 AM IST
    Follow us on

    ఆగస్టు 5 చరిత్రలో మరపురాని రోజుగా మిగిలిపోతుంది. పోయిన సంవత్సరం ఇదే రోజు ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్ ని భారత్ లో పూర్తిగా మమేకం అయ్యే పునాదులు నిర్మించారు. ఈ సంవత్సరం ఇదే రోజు కోట్లాది హిందువుల మనోభావాలకు అనుగుణంగా రాముని జన్మభూమి లో మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ రెండు చర్యలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేవే. ఈ రెండు పనులు విజయవంతంగా , చాకచక్యంగా చేయటం లో మోడీ నాయకత్వ పటిమను అభినందించకుండా ఉండలేము. ఒకటి 72 సంవత్సరాల సమస్య, రెండోది 500 సంవత్సరాల సమస్య. ఈ రెండూ స్వాతంత్రం వచ్చినప్పటినుంచీ మనకు గుదిబండలాగా వేలాడుతూనే వున్నాయి. వీటికి పరిష్కారం కనుగొనటానికి నిజాయితీగా ఇంతకుముందు పాలకులు ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. మొదటిది పాలకుల స్వయంకృతాపరాధం అయితే రెండోది చారిత్రక వారసత్వం . గత వారం రోజులనుంచి ఈ రెండింటిపై పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మేధావుల్లో ఎక్కువమంది ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విమర్శల జోరు పెంచారు. కానీ ఒక్కరుకూడా ఇంతకుమించి శాశ్వత పరిష్కారమేమిటో చూపించలేదు. కాశ్మీర్ సమస్య పై ఈ మాట్లాడే వాళ్ళు ఒక్కరుకూడా ఎలా పరిష్కరించాలో చెప్పరు. ఎందుకు ఈ సమస్యను ఇంతకుముందు పాలకులు పరిష్కరించలేకపోయారో చెప్పరు. కానీ ఈ ప్రభుత్వం ఆర్టికల్  370 రద్దు చేయటంతో కాశ్మీర్ అల్లకల్లోలం అయినట్లు అంతకుముందు పరిస్థితులు సాఫీగా వున్నట్లు ఓ భావన సృష్టిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం రామమందిర భూమిపూజకే పరిమితమవుదాం.

    అయోధ్య రామజన్మ భూమి వివాదానికి ముగింపు 

    గత వారం రోజులనుంచి జాతీయ చానళ్లలో ప్రధానమంత్రి రామమందిర భూమిపూజకు వెళ్ళటం పై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం కాబట్టి ప్రధానమంత్రి వెళ్లకూడదని వామపక్ష మేధావులు, ఇస్లాం వాదులు , ఉదారవాదులు వాదించారు. రాజకీయపార్టీలు బిజెపి  దాని మద్దత్తుదారులు తప్పించి అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు కూడా దాదాపు అదే పద్దతిని అవలంబించారు. కానీ కాంగ్రెస్ ఎప్పటిలాగే రెండు నాల్కల ధోరణిని అవలంబించింది. ముందుగా మౌనం వహించిన సోనియా గాంధీ కుటుంబం చివరకు ఒంటరివాల్లమవుతున్నామని భావించి చివరిలో రామమందిర నిర్మాణానికి  మద్దత్తుగా మాట్లాడవలసి వచ్చింది. ఈలోపు జరగాల్సిన నష్టం జరగనే జరిగింది. ఉదాహరణకు మధ్యప్రదేశ్ లో కమలనాథ్ పూర్తి మద్దత్తు ప్రకటిస్తే దిగ్విజయ్ సింగ్ హిందూ భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఈ డోలాయమానం చివరకు మైనారిటీ లలోనూ కాంగ్రెస్ ని నమ్మని పరిస్థితి తెచ్చింది. కేరళలో ముస్లిం లీగ్ ఏకంగా ప్రియాంక గాంధీ ప్రకటన పై తీర్మానమే చేసింది. ఇక అసదుద్దీన్ ఒవైసీ సరే సరి. దీన్ని అదనుగా తీసుకొని కాంగ్రెస్ పై నిప్పులు చెరిగాడు. అటు హిందువుల్లోనూ ఇటు ముస్లింల లోనూ కాంగ్రెస్ ఒంటరి అయ్యిందని చెప్పొచ్చు. సిపిఎం కూడా దీన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ ది ఎప్పుడూ అవకాశవాదమేనని వెక్కిరించింది.

    పరస్పర విరుద్ధ సిద్ధాంతాల కలయిక 

    అప్పటికీ ఇప్పటికీ గట్టిగా వ్యతిరేకిస్తున్న మేధావులు వామపక్షవాదులు, ఇస్లాం వాదులు. విశేషమేమంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో వామపక్ష మేధావులు, ఇస్లాం అనుకూల వాదులు దాదాపు ఒకే పంధాని అనుసరిస్తున్నారు. అమెరికాలో ఇస్లామిక్ వాదులు, వామపక్షవాదులు డెమోక్రటిక్ పార్టీలో ఇస్లాం దేశాల అనుకూల వైఖరిని అనుసరిస్తున్నారు. అలాగే బ్రిటన్ లో లేబర్ పార్టీలోనూ ఇదే తంతు నడుస్తుంది. యూరప్ దేశాల్లోనూ ఇటువంటి వైఖరే కనబడుతుంది. కానీ ఇస్లామిక్ దేశాల్లో వామపక్ష వాదుల్ని నానా హింసలు పెడుతున్నారు. ఇరాన్ , పాకిస్తాన్ , మిగతా గల్ఫ్  దేశాల్లోనూ ఇదేపరిస్థితి. వామపక్ష సిద్దాంతాన్ని  ముఖ్యంగా కమ్యూనిస్టులను దగ్గరకు కూడా రానియ్యరు. కాబట్టి వీరి సఖ్యత కేవలం ప్రజాస్వామ్య దేశాల్లోనే. అంతెందుకు మనదేశం లో కాశ్మీర్ లోగానీ, కేరళ లోగానీ, ఉత్తర ప్రదేశ్ లోగానీ, బీహార్ లోగానీ ముస్లిం ప్రజానీకం కమ్యూనిస్టులను ఆదరించలేదు. పశ్చిమ బెంగాల్ లో మొదట్లో మద్దతిచ్చినా ఒక్కసారిగా మొత్తం తృణముల్ కాంగ్రెస్ వైపు మళ్ళారు. చెప్పొచ్చేదేమిటంటే ప్రపంచం మొత్తం ఇస్లామిక్ సమాజం లో కమ్యూనిస్టులను ముఖ్యంగా భౌతికవాద సిద్ధాంతాన్ని శత్రువుగా చూస్తారు. అందుకే అక్కడ కమ్యూనిజం నిలదొక్కుకోలేదు. చాలా దేశాల్లో దాని ఉనికినే సహించరు. చివరకు పాకిస్తాన్ లో చానాళ్లు కమ్యూనిస్టులను నిషేదించారు. ప్రస్తుతం నామమాత్రంగా  వున్నా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇస్లాం దూషణ చట్టం కింద కఠిన శిక్షలు విధిస్తారు. ఇటీవల అలా మాట్లాడినవాళ్ళ సంగతి ఏమయిందో మనందరికీ తెలుసు. అక్కడిదాకేందుకు కమ్యూనిస్టులు అధికారం లో వున్న చైనా లో వీఘర్ ముస్లింలు , హువే ముస్లింలు ఎటువంటి నిర్బంధాలు ఎదుర్కుంటున్నారో చూస్తున్నాం. కాబట్టి ఈ ఇస్లాం అనుకూల విధానం శాశ్వతంగా నిలబడదు. ఇస్లాం సమాజానికి ఉదార వాదానికి చుక్కెదురు. ఇస్లాం సమాజానికి కమ్యూనిజం బద్ద శత్రువు. చివరకు  సెక్యులర్ టర్కీ లో ఏమయిందో చూస్తున్నాం. ఆధునిక టర్కీ నిర్మాత కమాల్ అటాటుర్క్ హగియా సోఫియా ని మ్యూజియం గా మారిస్తే ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు ఎర్డ్ గోవన్ దాన్ని మసీదుగా మార్చిన సంగతి మన కల్లెదుటనే జరిగింది. ఇది నిన్నగాక మొన్న జరిగిన సంఘటన. దానిపై ఒక్క ఉదారవాది మేధావీ భారత దేశంలో ఖండించిన పాపాన పోలేదు. ఇస్లాం సమాజంలో ఉదారవాదులు, హేతువాదులు ఉన్నప్పటికీ వాళ్ళు మనలేని పరిస్థితి. మతవాదం పురులు విప్పి నాట్య మాడే వేళ ఈ ఉదారవాదుల గొంతుక మూగపోవటం చరిత్రలో చూసాం. మరి ఈ ఇస్లామిక్ వాదులతో ఉదారవాదులు, కమ్యునిస్టులు మైత్రి తాత్కాలిక మే నని చెప్పాలి. ఇద్దరూ మైనారిటీ లో వున్నప్పుడు మైత్రి, నిర్ణయాత్మక స్థానంలో వుంటే అణిచివేత చరిత్రలో చూసాం. సిద్ధాంతపరంగా రెండువాదనలు స్థూలంగా ప్రజాస్వామ్య వ్యతిరేకులేనని చరిత్ర చెబుతున్న సత్యం.

    భారతీయ సంస్కృతి ఏం చెబుతుంది?

    సనాతన ధర్మమైన హిందూ మతం , వైదికాన్ని వ్యతిరేకించిన జైన, బుద్ధ మతాలూ కలిసి శతాబ్దాల తరబడి సహజీవనం చేసాయి. కొద్దిమంది రాజులు తప్ప ఎక్కువమంది అన్ని మతాల్ని సమానంగా గౌరవించారు. చివరకు భౌతికవాదాన్ని ప్రచారం చేసిన చార్వాకుడి ఆలోచనల్ని కూడా గౌరవించిన సమాజం మనది. అరబ్బుదేశాలనుంచి మన కేరళ తీరానికి వచ్చిన క్రైస్తవం, ఇస్లాం ను కూడా అక్కున చేర్చుకున్న ఘనత మనది. కాకపోతే ఉత్తరాది పశ్చిమ తీరాన్నుంచి వచ్చిన ఇస్లాం మాత్రం పూర్తి హింసాత్మకంగా , హిందూ సమాజం పై విరుచుకుపడిన అసహన , అరాచక వాదంగా అవతరించింది. అప్పటివరకు ఇస్లాం సామ్రాజ్యం జయించిన అన్ని ప్రాంతాల్లో ప్రజల్ని ముస్లింలుగా మార్చగలిగినా భారత్ లో అది సాధ్యంకాలేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఆ మార్పు జరిగింది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయటానికి వేల దేవాలయాల్ని నేలమట్టం చేసినా, ఇస్లమేతరులపై పన్నులు విధించినా ఇంకా ఎన్నో నిర్బంధాలకు గురిచేసినా ఫలితం మాత్రం పాక్షికమే. ఇది చరిత్రకారులు పరిశీలించాల్సిన అంశం.

    చివరకు సెక్యులరిజం పేరుతో క్రైస్తవ మిషనరీలను తీసుకొచ్చి విద్యా, వైద్య రంగాల ద్వారా ప్రజల్ని ఆకర్షించి మతమార్పిడి చేయాలని చూసినా దాని ఫలితమూ పాక్షికమే. ఇప్పటికీ నూటికి మూడొంతుల ప్రజలు హిందూ మతం లోనే వుండిపోయారు. భారతీయ సంస్కృతి లో సింహభాగం సనాతన ధర్మం, ఇతర భారతీయ మతాలదే ననేది దాచేస్తే దాగని సత్యం. కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భారతీయ సంస్కృతి కి సింహభాగం దక్కలేదు. ఎప్పుడో వలసవాదులు రాసిన చరిత్రనే చదువుకుంటూ మూలాలను సృజించటం మరిచిపోయాము. అందుకే ఈ తిరుగుబాటు. గత రెండు మూడు దశాబ్దాల హిందూ సామాజిక చైతన్యాన్ని ప్రజలు ఆదరించటాన్ని లోతుగా పరిశీలించకుండా దీన్ని పరిమితమైన కోణం నుంచే చూసి ఇదేదో కొంతమంది పనిగట్టుకొని రెచ్చగొట్టారని అనుకోవటం నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేయటమే. రామజన్మభూమి ఉద్యమాన్ని ఈ కోణం నుంచి పరిశీలించాల్సి వుంది. కోట్లాది హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయంగా అర్ధం చేసుకోవటం లో  మేధావులు  విఫలమయ్యారని చెప్పాల్సివుంది. ఇదే ఒక మక్కా విషయం లోనో, ఒక బెత్లేహాం విషయం లోనో జరిగితే ప్రతిచర్య ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే సెక్యులరిజం పేరుతో మనం చేస్తున్న నిర్వాకం అర్ధమవుతుంది. వందల ఏళ్ళు క్రుసేడ్ల పేరుతో జెరూసలెం కోసం కొట్టుకున్న చరిత్రను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మత సమస్య ఎంత సున్నితమైనదో గుర్తుకొస్తుంది.చివరకు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా ధోరణి మారలేదంటే వీళ్ళ మనస్సుల్లో హిందూ వ్యతిరేకత గూడుకట్టుకుందని చెప్పాలి.

    వీళ్ళు చెప్పే సెక్యులరిజం నేతిబీరకాయలో నేయిలాంటిది. ముమ్మూరు తలాఖ్ నిషేదాన్ని వ్యతిరేకించటం, వుమ్మడి పౌర స్మృతి ని వ్యతిరేకించటం వీళ్ళ సెక్యులరిజం ఏ స్థాయిదో అర్ధమవుతుంది. ఇఫ్తార్ విందులకు ప్రభుత్వ ఖజానా ఖర్చు పెట్టి పార్టీలు ఇచ్చినప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాదు. చర్చీలకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టినప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాదు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ప్రధానమంత్రి భూమిపూజకు హాజరయితే మాత్రం సెక్యులరిజం గుర్తుకొస్తుంది. ఒవైసీ పార్టీ పేరులోనే మతాన్ని పెట్టుకొని సెక్యులరిజాన్ని గురించి మాట్లాడుతుంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుండదు. సెక్యులరిజం పేరుతో హిందూ వ్యతిరేక ముస్లిం, క్రైస్తవ కూటమిని కట్టటం దానికి మతానికి వ్యతిరేకమని చెప్పే కమ్యునిస్టులు మద్దత్తివ్వటం, ఏ మతానికి అనుకూలం కాదనే ఉదారవాదులు కేవలం హిందూ వ్యతిరేక పంధాని అవలంబించటం సెక్యులరిజమయితే అటువంటి సెక్యులరిజం మనకొద్దు. భారతీయ సంస్కృతి అన్ని మతాలను గౌరవించే సంస్కృతి. అంటే అర్ధం హిందూ మత విశ్వాసాలను బలిపెట్టి ఇతరమతాలను గౌరవించటం కాదు. మెజారిటీ మత విశ్వాసాలను గౌరవిస్తూనే ఇతర మత విశ్వాసాలను గౌరవించటం. అలా కాకుండా మెజారిటీ మతస్తుల ను రెచ్చగొట్టి గౌరవం కావాలనుకుంటే అది మొదటికే మోసం వస్తుంది. నిన్నటి ఒవైసీ ప్రకటన అత్యంత ప్రమాదకరమైనది. హగియా సోఫియా లాగా తిరిగి రామమందిరం స్థానం లో బాబ్రీ మసీదు ని నిర్మిస్తామని చెప్పటం అంటే అర్ధమేమిటి? టర్కీ లో నూటికి తొంభై మంది ముస్లింలు. మరి ఇక్కడ నూటికి 75 శాతం హిందువులు. ఇక్కడ రామ మందిరం స్థానం లో ఎప్పటికైనా బాబ్రీ మసీదు నిర్మించాలంటే మెజారిటీ హిందువుల్ని ముస్లింలుగా మార్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ దేశంలోని కమ్యూనిస్టులు, ఉదారవాదులు ఈ ప్రకటనను ఎందుకు ఖండించరు? సెక్యులరిజాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల్లో చూడటమంటే ఇదే.

    రామరాజ్యమంటే ఏమిటి?

    రాముని పరిపాలన ని ఆదర్శవంతంగా భారతీయ ప్రజలు భావిస్తారు. ధర్మం కోసం, విలువల కోసం ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తిగా భారతీయులు రామున్ని పూజిస్తారు. చట్టబద్ద పరిపాలనను నిజాయితిగా అమలుచేసిన పరిపాలనా దక్షుడు. అందుకే మహాత్మా గాంధీ రామరాజ్యం కావాలని కోరుకున్నాడు. గాంధీ కనుక ఆ మాట చెప్పివుండకపోతే ఈ ఉదారవాదులు, కమ్యూనిస్టులు దానిపై పెద్ద రగడే చేసివుండేవాళ్ళు. అప్పటికీ అక్కడక్కడా దీనిపై విపరీత వ్యాఖ్యానాలు వస్తూనే వున్నాయి. అప్పటి సమాజ విలువల్ని, ధర్మాన్ని ఈనాటి విలువలతో పోల్చి దాన్ని వ్యతిరేకించటం సరైనదికాదు. విలువలు ఎప్పుడూ సాపేక్షకమైనవి. అవి కాలాన్ని బట్టి మారుతూ వుంటాయి. ఆరోజుకి ఏవి సమాజహితంగా వున్నాయో వాటికోసం నిబద్దతతో పనిచేయటం కొలబద్దగా వుండాలి. ఆ కోణంలో చూసినప్పుడు రాముడు ఆదర్శపురుషుడు, రామరాజ్యం సర్వజన హితం.అందుకే పార్టీలకతీతంగా , మతాల కతీతంగా, దేశాల కతీతంగా రామున్ని ఆరాధిస్తున్నారు. భారతీయ సమాజాన్ని నిర్మించాలంటే భారతీయ సంస్కృతి మూలాలను మరిచిపోకూడదు. మనతో పాటు ప్రాచీన సంస్కృతి వున్న చైనా లో ఈ విషయాన్ని కమ్యూనిస్టులు గుర్తించి ఇటీవలికాలంలో కన్ఫ్యుషియాస్, టాంగ్ మతాలను వాటి సంప్రదాయాల్ని ప్రోత్సహిస్తున్నట్లు అనేకమంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏ దేశం కూడా వాటి మూలాల్ని మరిచిపోతే మనుగడ సాగించలేదు. అందుకే రామ మందిర నిర్మాణాన్ని జాతీయ సంస్కృతిలో భాగంగా చూద్దాం, మత కోణంలో కాదు. మనం నిర్మించాల్సింది ఇండియా ను కాదు భారత్ ని.