Ali-Posani: గత ఎన్నికల్లో వైసీపీకి సినీ నటులు అండగా నిలిచారు. పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారికి గుర్తింపు లేకుండా పోయిందన్న విమర్శలైతే ఉన్నాయి. గత ఎన్నికల్లో నటులు మోహన్ బాబు, అలీ, పోసాని కృష్ణమురళీ, పృధ్విరాజ్ తదితరులు వైసీపీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. వైసీపీ అభ్యర్థుల తరుపున చాలా నియోజకవర్గాల్లో పోటీ సైతం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పృధ్విరాజ్ కు తప్ప మిగతా వారికి పదవులు దక్కలేదు. కానీ ఇటీవల పృధ్విరాజు పార్టీకి దూరమయ్యారు. అటు మోహన్ బాబు కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలీ, పోసానిలు పదవుల కోసం కాయలు కాచేలా చూస్తున్నారు. మూడేళ్ల వైసీపీ పాలన గడిచిపోవడంతో అదిగో ఇదిగో అంటున్నారే తప్ప పదవులు మాత్రం కేటాయించలేదు. దీంతో వైసీపీలో ఉన్న సినిమా నటులు కాస్తా డల్ అయ్యారు. ఇటీవల సైలెంట్ గా ఉన్నారు.
ఎట్టకేలకు గుడ్ న్యూస్..
ముఖ్యంగా అలీ అయితే రెండు మూడు సార్లు ఆయనకు పదవులు కేటాయించినట్టు ప్రచారం సాగింది. ఒకటి రెండు సార్లు అలీ సీఎం జగన్ ను కలిశారు కూడా. తొలుత రాజ్యసభ, ఆ తరువాత కేబినెట్ హోదాతో సమానమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి అలీకి కేటాయించనున్నారన్న ప్రచారం జరిగింది. అలీ దంపతులు కలిసిన సందర్భంలో మీకు గుడ్ న్యూస్ చెబుతానంటూ స్వయంగా జగన్ చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే గుడ్ న్యూస్ ఏదీ అలీ చెవిటన పడలేదు. ఇప్పుడు మరోసారి ఆయనకు పదవి కేటాయించనున్నారన్న ప్రచారం అయితే సాగుతోంది. అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం పెద్ద పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తన మనసులో ఉన్న మాటను ఇప్పటికే అధిష్టాన పెద్దలకు తెలిపినట్టు తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆస్తులు, అప్పుల విలువ ఎంతో తెలుసా?
పోసానికి కీలక పోస్టు..
మరో నటుడు పోసాని కృష్ణమురళీ కూడా నామినెటెడ్ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనకు పదవి ఖాయమని నమ్మకంగా ఉండేవారు. అయితే అంతకంటే ముందుగానే తన సహ నటుడు పృధ్విరాజు మంచి నామినేటెడ్ పదవినే కొట్టేశారు. పోసానికి మాత్రం ఎటువంటి పదవీ కేటాయించలేదు. అయితే ఆయన సీఎం జగన్ పై కానీ..వైసీపీ పైన కానీ ఈగ వాలనివ్వరు. అటు జనసేన పవన్ కళ్యాణ్ పై సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భాలున్నాయి. ఒకానొక దశలో అభ్యంతరకర వ్యాఖ్యలు సైతం చేశారు. అయితే ఇవన్నీ వైసీపీ అధిష్టానం దృష్టిలో పడేందుకేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. అందుకు తగ్గట్టే ఆయనకు ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడతారని టాక్ అయితే నడుస్తోంది.
సీఎంకు చేరిన ఫైల్…
ఒక్క అలీకే పదవి ఇచ్చి పోసానికి మొండిచేయి చూపితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముండడంతో ఇద్దరికీ నామినేటెడ్ పదవులు ఒకేసారి ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారుట. ఇప్పటికే అందుకు సంబంధించి ఫైల్ సీఎం టేబుల్ పైకి వెళ్లినట్టు సమాచారం. వైసీపీకి వచ్చే ఎన్నికలు కీలకం. పైగా సినిమా పరిశ్రమ కొంతవరకూ దూరమైందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న వారిని కాపాడుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. అందుకే గత ఎన్నికల్లో తనతో నడిచిన అలీ, పోసానిలకు పదవులు కేటాయించేందుకు జగన్ సిద్ధమయ్యారన్న మాట.
Also Read:ADR Report: 15,077.97 కోట్ల విరాళాలు తీసుకున్నాయి: ఏ పార్టీ సుద్దపూస కనుక