PRC Fight: ఏపీలో సర్కారు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు ఇప్పటికే తమ వైఖరిని వెల్లడించాయి. ఈ రోజు సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగ సంఘలు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ ఆహ్వానించింది. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం.. ముందు పీఆర్సీ రద్దు చేసిన తర్వాతనే చర్చలకు పిలవండంటూ తేల్చేసి చెప్పాయి. అశుతోశ్ మిశ్ర నివేదిక ను ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి డిమాండ్ చేసింది.
ఉద్యోగులు ఇప్పటికే వివిధ రూపాల్లో తమ నిరసనను తెలుపుతున్నారు. విజయవాడలోని రెవెన్యూ ఆఫీస్‌లో పీఆర్సీ స్టీరింగ్ కమిటి దాదాపుగా 5 గంటలపాటు సమావేశమైంది. జిల్లాల్లో ఉద్యమ కార్యాచరణ సమన్వయం, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై స్పందించేందుకు 8 మంది సభ్యులతో ఓ పర్యవేక్షణ సెల్ ఏర్పాటైంది. దీనితో పాటు స్టీరింగ్ కమిటీలో మెంబర్స్‌ను 20కి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాలపై బండి శ్రీనివాస రావు స్పందించారు. స్టీరింగ్ కమిటీలో అన్ని అంశాలపైనా చర్చించామని వెల్లడించారు. సీఎస్‌కు సోమవారం సమ్మె నోటీస్ ఇస్తామని తెలిపారు.
Also Read: ‘ఓటీటీ’ : ఈ వారం సినిమాల పరిస్థితేంటి ?
అమరావతి చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియా, మీడియా ద్వారా ఉద్యోగులపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. మరో వైపు ఉద్యోగ సంఘాలు స్పందిస్తూ.. ఉద్యమ టైంలో ఆవేశంతో, ఆవేదనలో మాట్లాడినందుకు గానూ కేసులు పెట్టేందుకు ట్రై చేస్తున్నారని, వలంటీర్ల ద్వారా ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించాయి. ఇది సరికాదని హెచ్చరించాయి. ఒక వైపు చర్చిద్దామని ఆహ్వానం పంపుతూనే.. మరో వైపు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నాయి.
పీఆర్సీకి సంబంధించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను ఇస్తేనే సర్కారుతో చర్చించేందుకు ముందు వస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పష్టం చేశారు. వేతన సవరణ అనేది ప్రభుత్వం, ఉద్యోగులకు సంబంధించిన అంశం అని.. ఇరు వర్గాల మధ్య ఏదైనా ఉంటే ప్రభుత్వం, ఉద్యోగులు కలిసి సమస్యను చర్చించుకోవాలి గానీ.. పార్టీ కార్యకర్తలతో ఉద్యోగులపై తప్పుడు ప్రచారం చేయించడం ఏంటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: తన కుమార్తె ఫోటో పై అనుష్క స్పందన !