Jagan- Chandrababu: ఇప్పుడు ఏపీలో ‘సంక్షేమమే’ తారక మంత్రం. ప్రజలను ఆకర్షించగల ఒక యుద్ధ తంత్రంగా మారిపోయింది. వారి కంటే మేము ఎక్కువ ఇస్తామంటేనే ప్రజలు అటువైపుగా చూసేటంతటి పరిస్థితి దాపురించింది. పథకాలు వద్దు మంచి పాలన అందిస్తామని ప్రకటించినా ప్రజలు పట్టించుకోరు. అంతలా వారిపై సంక్షేమ పథకాలు ప్రభావం చూపుతున్నాయి. అందుకే జగన్ సర్కారు అభివృద్ధిని పక్కనపెట్టి మరీ ప్రజలను సంతృప్తి పెట్టే పనిలో ఉంది. నెలకు ఠంచనుగా సామాజిక పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం.. పాలనలో భాగమైన ఉద్యోగులకు మాత్రం నెలలో మూడో వారం వరకూ జీతాలు చెల్లిస్తూనే ఉంది. అటు అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. వారు న్యాయస్థానాల తలుపులు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే ప్రజల మనసును గుర్తెరిగిన జగన్ సంక్షేమంతోనే బలమైన ఓటు బ్యాంక్ సృష్టించుకున్నారు. కానీ దానిని నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో వనరులు సరిపోవని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. అప్పులు తెచ్చి మరీ అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇవే అధికారాన్ని అందిస్తాయని జగన్ బలంగా నమ్ముతున్నారు. అయితే విపక్షాలు సైతం సంక్షేమం వద్దు అనే మాట నేరుగా చెప్పలేకపోతున్నారు. అలా అంటే ప్రజలు దూరమైపోతారన్న ఆందోళన వారిది. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాత్రమే మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని దివాలా దిశగా మార్చేశారని మాత్రమే ఆరోపణలు చేయగలుగుతున్నారు. అంతకు మించి ఒక్క మాట అనలేకపోతున్నారు. అదే సమయంలో తాము సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల లబ్ధిపొందుతున్న వారు మాత్రం అవి కొనసాగాలని కోరుతున్నారు. అవసరమైతే ఇప్పుడున్న లబ్ధి కంటే పెంపును ఎక్కువ మంది ఆశిస్తున్నారు. అది ఎవరు ఇస్తామంటే వారికి సపోర్టు చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే లబ్ధిదారుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారే. వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి… ప్రభుత్వం అప్పులు చేస్తోందా? లేకుంటే రాష్ట్రం దివాలా తీస్తుందా? అన్నది ఆలోచించరు. అందుకే వీలైనంత ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ధికి ఆశిస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగింపు కోరుకుంటూనే కొత్త పథకాల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. కానీ పెంచే పరిస్థితి ప్రభుత్వాల వద్ద ఉందా? అంటే అది మచ్చుకైనా కనిపించదు. అందుకే వచ్చే ఎన్నికల తరువాత ఎవరు గద్దెనెక్కిన వారికి గడ్డుకాలమే.

చంద్రబాబు సంక్షేమానికి ఒప్పుకోడని ఆ మధ్య సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. చంద్రబాబు పాలన వరకే కానీ.. ప్రజలకు నేరుగా ఇవ్వడానికి ఇష్టపడరు అని సంకేతం వచ్చేలా ధర్మాన మాట్లాడారు. వైసీపీ శ్రేణులు కూడా ఇప్పుడు ఆ వ్యాఖ్యలనే ఆదర్శంగా తీసుకొని వైరల్ చేస్తున్నాయి. అయితే దానిపై చంద్రబాబు కూడా జాగ్రత్తపడ్డారు. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని చెబుతూనే.. మరికొన్ని పథకాలు యాడ్ చేస్తానని ప్రకటనలు జారీచేస్తున్నారు. అటు వ్యూహకర్త రాబిన్ శర్మ చేతికి పనికూడా చెప్పారు. వైసీపీకి మించి పథకాలు రూపొందించాలని.. అవి ప్రజలకు ఆలోచింపజేసే విధంగా ఉండాలని కోరారుట. త్వరలో నవరత్నాల మాదిరిగా టీడీపీ కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేసే చాన్స్ కనిపిస్తోంది.