Chandrababu: జగన్ సర్కారుపై పోరాటం విషయంలో చంద్రబాబు పంథా మార్చారు. జాతీయ స్థాయిలో జగన్ ను మరింత పలుచన చేసేందుకు సిద్ధపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతలు, ప్రజావ్యతిరేక పాలన వంటి విషయాలపై జాతీయ స్థాయిలో గళమెత్తాలని భావిస్తున్నారు. ఢిల్లీ రాజకీయాలను వేదికగా చేసుకొని జగన్ ప్రభుత్వంపై పోరాటానికి నిర్ణయించారు. పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ పార్టీ విధానాలపై క్లారిటీ ఇచ్చారు. సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే విషయాలపై చర్చించారు. ప్రధానంగా ఏపీ సమస్యలను అజెండాగా తీసుకోవాలని ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, దానికి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని దేశం గుర్తించేలా పార్లమెంట్ లో గళమెత్తాలని సూచించారు.

పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో పార్టీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు కీలక సూచనలు చేశారు. చంద్రబాబు సభలు కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో 1 విడుదల చేసింది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి జీవోను తెచ్చి రోడ్డు షోలు, సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించింది. విపక్షాల గొంతు నొక్కేందుకేనని విమర్శలు వచ్చినా తగ్గలేదు. దీంతో హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. తొలుత హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ జీవోను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపారు. ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ పూర్తయినా తీర్పు రిజర్వ్ లో ఉంది. ఈ నేపథ్యంలో దీనిని ఒక ప్రాధాన్యతాంశంగా తీసుకొని మాట్లాడాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు.

స్థానిక సంస్థల నిధుల పక్కదారిపై కూడా చంద్రబాబు ఎంపీలకు కొన్నిరకాల సూచనలు చేశారు. స్థానిక సంస్థలను జగన్ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేసింది. వాటిని అచేతనం చేయడంపై సొంత పార్టీ సర్పంచ్ లే రోడ్డెక్కారు. నిధుల దారి మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. అలాగే కేంద్రం అనుమతికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని జగన్ సర్కారు ఎలా దివాలా తీస్తుందో.. జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన స్థితిని.. నెలలో మూడో వారం దాటుతున్నా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిని పార్లమెంట్ లో ప్రస్తావించాలని సూచించారు. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలు, పొలవరం పట్టించుకోకపోవడం వంటిని హైలెట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.వీటితో పాటు విభజన హామీలను ప్రస్తావించాలని పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నానిలకు అధినేత సూచించారు. మొత్తానికైతే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను వర్కవుట్ చేసుకోవాలన్న తలంపులో చంద్రబాబు ఉన్నారు. జగన్ సర్కారు పరువు తీసేందుకు సిద్ధపడుతున్నారు.