
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఏపీలో మద్యం దుకాణాలు తీర్చుకోవడం లేదు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు అధికారులు, ఇతర సిబ్బంది సహకారంతో అనధికారకంగా విక్రయాలు జరుపుతున్నారు. గతంలో బెల్టుషాపులు నిర్వాహకులు, కొన్ని చోట్ల చోటమోటా రాజకీయ నాయకులు, అధికారులు సైతం ఈ చర్యలకు పాల్పడి లాక్ డౌన్ సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు. మద్యానికి బానిసలైన వారి నిస్సహాయత వీరికి వరంగా మారింది. రాష్ట్ర రాజధాని కేంద్రమైన గుంటూరు, విజయవాడ ఈ నగరాలకు సమీపంలో ఉన్న మండల కేంద్రాలు, గ్రామాల్లో యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. అదీ లాక్ డౌన్ అమలులో ఉండే సాయంత్రం వేళల్లో జరగడం ఆచర్యానికి గురిచేస్తోంది.
మద్యం అక్రమంగా తరలిస్తున్న, నిల్వ ఉంచిన ఘటనలు లాక్ డౌన్ ప్రకటించిన తూర్పుగోదావరి, ప్రకాశం, చిత్తూరు తదితర జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. మద్యం షాపుల్లో మద్యం సీసాలు చోరీ చేసిన సంఘటనలు కృష్ణా, కడప తదితర జిల్లాలో వెలుగు చూశాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి హెచ్చరికలను ఖాతరు చేయకుండా రాష్ట్రంలో జోరుగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎటువంటి సంఘటనలు కరోనా వైరస్ వ్యాప్తికి మరింత అవకాశాన్ని ఇస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు మద్యం విక్రయాలు చేసున్న అక్రమార్కులు వాటి ధరలను రెండు లేక మూడింతలు పెంచి విక్రయిస్తున్నారు. గతంలో రూ.1200 ఉన్న మద్యం బాటిల్ ప్రస్తుతం రూ. 3 వేల నుండి 5,500 వరకూ వసూలు చేసున్నారు. క్వాటర్ బాటిల్ పైన రూ. 250 వరకూ అధనంగా వసూలు చేస్తున్నారు. తాగుబోతుల బలహీన వారికి వరం గా మారింది. చాలా మద్యం షాపులలో మద్యం నిల్వలు మాయం అయినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై విచారణ నిర్వహించి, ఇందుకు బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు, మద్యం షాపుల్లో నిల్వపై విచారణ జరిపితే గాని మొత్తం వ్యవహారం బయటకు వస్తుందంతున్నారు.