
కరోనా నివారణ ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లనుంచి బయటకువచ్చే వారు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పల్లె ప్రాంతాలలో మాస్క్ లు ధరించే విషయంలో అధికారులు చూసి చూడనట్లు వదిలేశారు కానీ గ్రామాలలో కూడా కొంతమందిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేనప్పటికి కరోనా పాజిటివ్ వస్తుండడంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైరస్ సోకకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, ఆఫీసులు, పనిచేసే ప్రాంతాల్లో మాస్క్ లు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాజధాని లో పలు ప్రాంతాలను ప్రభుత్వం కరోనా కట్టడికి హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓల్డ్ మలక్ పేట, సైదాబాద్ ఏసీపీ ఆఫీస్ నుంచి సపోట బాగ్, పూర్ణోదయ కాలనీ, సంతోష్ నగర్ ఏరియాల్లో ఈ రోజు పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవ్వరూ కూడ ఇళ్ల నుంచి రాకుండా పూర్తిగా రోడ్లను అష్టదిగ్భంధం చేశారు. ప్రజలకు నిత్యావసరాలను అధికారులే అందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 678 కేసులు, 33 మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6761కి చేరింది. తెలంగాణలో 471 మంది కరోనా భారినపడ్డారు.