Etela Rajender: నేను చేసిన తప్పు ఏ నాయకుడు చేయొద్దు.. ఈటల వ్యాఖ్యల దుమారం

రెండేళ్లుగా బీజేపీలో ఉంటున్న ఈటల రాజేందర్‌ ఆ పార్టీలో కీలక పదవులు కూడా నిర్వహించారు. చేరికల కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేశారు. ఎన్నికల కమిటీ చైర్మన్‌గా బాధ్యలు నిర్వహించారు.

Written By: Raj Shekar, Updated On : February 2, 2024 5:06 pm
Follow us on

Etela Rajender: ఈటల రాజేందర్‌ తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌)లో రాజకీయాల్లోకి వచ్చిన నేత. పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు అందులో కొనసాగారు. అంచలంచెలుగా ఎదిగి నంబర్‌ 2 స్థానానికి చేరుకున్నారు. కానీ, నంబర్‌ 2 స్థానంలో ఎవరున్నా తొక్కిపడేయడం కేసీఆర్‌కు అలవాటు. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతిని కూడా అలాగే చేశారు. రెండున్నరేళ్ల క్రితం ఈటల రాజేందర్‌ విషయంలో అదే చేశాడు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడమే కాకుండా, పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశాడు. భూ కబ్జాల ఆరోపణలతో కేసులు పెట్టించారు. దీంతో ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌తో 20 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ రెండింటి నుంచి అవకాశం వచ్చినా.. కేసీఆర్‌ను ఎదుర్కొనాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని కాషాయ కండువా కప్పుకున్నారు.

రెండేళ్లుగా బీజేపీలో..
ఇక రెండేళ్లుగా బీజేపీలో ఉంటున్న ఈటల రాజేందర్‌ ఆ పార్టీలో కీలక పదవులు కూడా నిర్వహించారు. చేరికల కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేశారు. ఎన్నికల కమిటీ చైర్మన్‌గా బాధ్యలు నిర్వహించారు. సీనియర్‌ నేత అయిన రాజేందర్‌కు బీజేపీ కూడా సముచిత స్థానమే కల్పించింది. అయితే ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఈటల మొన్నటి ఉప ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు. హుజూరాబాద్‌తోపాటు, గజ్వేల్‌ నుంచి పోటీ చేశారు. కానీ రెండింటిలో ఓడిపోయారు. కేసీఆర్‌ టార్గెట్ గా పనిచేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన హుజూరాబాద్‌ ఓటర్లు కూడా ఈసారి ఈటలను ఓడించారు.

తప్పు చేశానని..
ఇటీవల ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈటల రాజేందర్‌ పార్టీ మార్పుపై చాలా రోజుల తర్వాత స్పందించారు. పార్టీ మారిన కొత్తలో కమ్యూనిస్టు భావాలు ఉన్న నేత బీజేపీలో ఒదుగుతారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, రెండేళ్ల తర్వాత ఇప్పటికీ ఆ పార్టీలో ఇంకా ఒదిగిపోనట్లు తెలుస్తోంది. యూట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో తాను పార్టీ మారి తప్పు చేశానని చెప్పకే చెప్పారు. తనలా ఎవరూ తప్పు చేయొద్దని సూచించారు. 20 ఏళ్లు ఉన్న పార్టీలో దక్కిన గౌరవం కొత్త పార్టీలో కోరుకోవడం అత్యాశే అవుతుందన్నారు. అయినా సర్దుకు పోతున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.