BRS: తెలంగాణలో దశాబ్దకాలం అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పాలనలో ఎలాంటి అక్రమాలు జరుగలేదు అన్నట్లుగా చూపించారు. పోలీస్, ఏసీబీ, మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్న గులాబీ బాస్ కేసీఆర్ తన పాలనలో జరిగిన అక్రమాలను బయటకు రాకుండా చూసుకున్నారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా రహస్యంగా జీవో జారీ చేశారు. ఇక వందల జీవలోను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కనిపించకుండానే జారీ చేశారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పాలనకు స్వస్తి పలికారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన కుంభకోణాలను బయటపెడుతోంది. వాటిని చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. మీడియా సంస్థలను కేసీఆర్ ఎంత మేనేజ్ చేశాడో అర్థమవుతోంది.
మొన్న శివబాలకృష్ణ.. నిన్న సోమేశ్‌కుమార్..
తెలంగాణలో ఎన్ని అక్రమాలు జరిగాయో తెలియడానికి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాల కృష్ణ, మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ విషయంలో వెలుగు చూసిన అంశాలే నిరద్శనంగా నిలుస్తున్నాయి. శివబాల కృష్ణ ఇంటిపై దాడిచేసిన ఏసీబీ రూ.150 కోట్లు పట్టుకుంది. విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు. ఇక మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆస్తుల చిట్టాలోని ఇటీవల వెల్లడైన అంశాలు చూస్తే యాచారంలో పక్కా ప్రణాళికతో కూడిన భూసేకరణ పథకాన్ని బహిర్గతం చేశాయి. ఈ ప్రాంతంలో ఫార్మా సిటీ అభివృద్ధి చెందుతుందని ఊహించి తక్కువ ధరకు 25 ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. రెండు ఘటనలతో బీఆర్‌ఎస్ పాలనలో పనిచేసిన అందరు అధికారులను అనుమానంగా చూడాల్సి వస్తోంది. అధికారుల చిత్తశుద్ధిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అనుమానిత జాబితాలో..
రెరా బాలకృష్ణ, విద్యుత్ శాఖకు చెందిన ప్రభాకర్, సింగరేణికి చెందిన శ్రీధర్, టీఎస్‌పీఎస్సీకి చెందిన జనార్దన్‌రెడ్డి, హెటిరో పార్ధసారథి, కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్, వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు పరిశీలనలో ఉన్నారు. మరి వీరిలో ఎంతమందికి క్లీన్‌చిట్ వస్తుందో చూడాలి.
అధికార పార్టీ అండతో..
అధికార బీఆర్‌ఎస్ పార్టీ అండతోనే ఐఏఎస్‌లు అక్రమాలకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మద్యం, ఇసుక, రోడ్డు కాంట్రాక్టులు వంటి ఆస్తులు కూడబెట్టేందుకు గతంలో ఉన్న మార్గాలు లేకపోవడంతో భూములపై దృష్టి సారించింది. ఒకే కుటుంబానికి చెందిన పార్టీల అధికార కేంద్రీకరణ మనుగడ కోసం, ఎన్నికల ఖర్చులను తిరిగి పొందడం కోసం భూ సేకరణపై ఆధారపడటానికి దారితీసింది. దీనివల్ల అవినీతి అక్రమాలు, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, భూముల రిజిస్ట్రేషన్ కు ప్రాక్సీలను వినియోగించడం వంటివి జరుగుతున్నాయి.