Homeజాతీయ వార్తలుDelhi : జనరల్ బోగీలు లేవు.. 1,500 టికెట్లు ఇచ్చారు..ఢిల్లీ తొక్కిసలాట ప్రమాదంలో విస్తు గొలిపే...

Delhi : జనరల్ బోగీలు లేవు.. 1,500 టికెట్లు ఇచ్చారు..ఢిల్లీ తొక్కిసలాట ప్రమాదంలో విస్తు గొలిపే వాస్తవాలు!

Delhi :  న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట కు ముందు ఒక వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రకారం భారీగా ప్రయాణికులు బ్రిడ్జి పై నిలబడి ఉన్నారు.. అయితే అంతస్థాయిలో ప్రయాణికులను ఒకేసారి రైల్వే అధికారులు లోపలికి ఎలా పంపించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. రద్దీని నియంత్రించడానికి ఎందుకు చర్యలు చేపట్టలేదని మండిపడుతున్నారు. మహా కుంభమేళ (mahakumbh Mela) కు వెళ్లే ప్రత్యేక రైలుకు 1500 టికెట్లు ఎలా జారీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ” మన దేశం చైనాతో పోటీపడాలి. బుల్లెట్ రైళ్లు కచ్చితంగా కావాలి. వందే భారత్ రైళ్ళు కూడా రావాలి. కానీ పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా జనరల్ బోగీలలోనే ప్రయాణాలు సాగిస్తారు. అలాంటప్పుడు వారు ప్రయాణించే బోగీలను తగ్గిస్తామని చెబితే ఎలా? కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో జనరల్ బోగీల సంఖ్య తగ్గుతోంది. అవి లేకపోవడం వల్ల ప్రయాణికులు ఏసి, స్లీపర్ కోచ్లలో ఎక్కుతున్నారు. దీంతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అదే సమయంలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలి. వాటి సంఖ్యను పెంచకపోతే పేద, మధ్యతరగతి ప్రజలు ఎందులో ప్రయాణిస్తారు? వారు సుదూర ప్రయాణాలు ఎలా చేస్తారు? రైల్వే శాఖ ఇప్పటికైనా ఆలోచించాలి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కాస్తయినా పట్టించుకోవాలి. లేనిపక్షంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందని” నెటిజన్లు మండిపడుతున్నారు.

రైల్వే శాఖ ఏం చెబుతోంది అంటే..

ఢిల్లీ ఘటన జరిగిన తర్వాత నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) హిమాన్సు శేఖర్ స్పందించారు. 14 – 15 ఫ్లాట్ ఫామ్ ల వైపుకు వస్తున్న ప్రయాణికులు మెట్ల మీద నుంచి జారిపడ్డారు. దీంతో వారి వెనుక ఉన్నవారు నెట్టుకున్నారు. ఫలితంగా ఈ ఘటన జరిగింది.. దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు జరిపిస్తున్నామని” వెల్లడించారు. అయితే ఆ ప్రాంతంలో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేదని.. అందువల్లే ప్రమాదం జరిగిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.. ఏది ఏమైనప్పటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల 18 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కమిటీ పేరుతో విచారణ జరిపిస్తామని చెబుతున్న రైల్వే శాఖ.. ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. మరోవైపు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉందని తెలిసినప్పటికీ సాధారణ బోగీలను రైల్వే శాఖ పెంచకపోవడం ఇంతటి ప్రమాదానికి దారితీసింది. మరోవైపు జనరల్ కంపార్ట్మెంట్స్ లేకపోయినప్పటికీ 1500 దాకా టికెట్లు ఇవ్వడం రైల్వే శాఖ పనితీరును సూచిస్తుంది. జనరల్ బోగీలు లేనప్పుడు 1500 దాకా టికెట్లు జారీ చేస్తే వారంతా ఎలా వెళ్తారని ఆలోచన రైల్వే శాఖకు లేకపోవడం దారుణం. కమిటీల పేరుతో విచారణ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? గాయపడిన వారు మామూలు మనుషులు అవుతారా? వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ రైల్వేశాఖ పాఠాలు నేర్వకపోవడం అత్యంత విషాదం. మరి ఇప్పటికైనా రైల్వే శాఖ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని… ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular