ప్లాస్మా చికిత్స చట్ట విరుద్ధమని కేంద్రం స్పష్టం

కరోనా కట్టడికి తగిన చికిత్స విధానం అందుబాటులో లేకపోవడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్మా విధానాన్ని అనుసరిస్తున్న సమయంలో అది ప్రమాదకరమని, చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తూ కేంద్రం వారికి షాక్ కలిగించింది. మొదటగా ఈ విధానాన్ని అమలు పరచిన ఢిల్లీ ప్రభుత్వం ఒక రోగి విషయమై విజయవంతమైన్నట్లు ప్రకటించి సంబరం చేసుకోవడం తెలిసిందే. అయితే ఇది కేవలం ప్రయోగ దశలోనే ఉన్నదని, ఇంకా నిరూపితం కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత వైద్య పరిశోధన […]

Written By: Neelambaram, Updated On : April 28, 2020 6:52 pm
Follow us on


కరోనా కట్టడికి తగిన చికిత్స విధానం అందుబాటులో లేకపోవడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్మా విధానాన్ని అనుసరిస్తున్న సమయంలో అది ప్రమాదకరమని, చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తూ కేంద్రం వారికి షాక్ కలిగించింది. మొదటగా ఈ విధానాన్ని అమలు పరచిన ఢిల్లీ ప్రభుత్వం ఒక రోగి విషయమై విజయవంతమైన్నట్లు ప్రకటించి సంబరం చేసుకోవడం తెలిసిందే.

అయితే ఇది కేవలం ప్రయోగ దశలోనే ఉన్నదని, ఇంకా నిరూపితం కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత వైద్య పరిశోధన మండలి పరిశోధన జరుపుతున్నదని, ఖచ్చితమైన ఫలితాలు వచ్చే వరకు రాష్ట్రాలు ఒక చికిత్స విధానంగా అమలు పరచవద్దని హితవు చెప్పింది.

ప్లాస్మా చికిత్స విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుడికి ప్రమాదకరమని, అంతేకాకుండా చట్ట విరుద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ప్లాస్మా థెరపీ ప్రయోగ దశలోనే ఉందని, కరోనాకు ఇదే చికిత్స విధానమని ఎలాంటి ఆధారం లేదని ఆయన తెలిపారు.

ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఐసీఎంఆర్ అధ్యయనం పూర్తయ్యే లోపు, ఈ చికిత్స సరైందేనని శాస్త్రీయ నిరూపణ జరిగే వరకూ ప్లాస్మా థెరపీని కేవలం ప్రయోగపరంగానే అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీని సరైన మార్గదర్శకాలు పాటించకుండా అందిస్తే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని లవ్ అగర్వాల్ హెచ్చరించారు.