
ఇరు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఉప ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి.. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుకు త్వరలో ఎన్నికలు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ రెండు ఎన్నికలు మిగిలిన పార్టీలకు ఎలా ఉన్నా బీజేపీకి మాత్రం పెద్ద ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎందుకంటారా..! ఈ రెండు సీట్లలో కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు చెప్పుకోదగ్గ అభ్యర్థులెవరూ లేరు. తిరుపతిలో టీడీపీ ఫలితం సంగతి ఎలా ఉన్నా తమ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించేసింది.ఇక వైసీపీ నుంచి థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా తకరారు మొదలైంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రత్నప్రభ ఏపీలో బీజేపీపై ఉన్న వ్యతిరేకత చూసి ఆమె పోటీ చేయనని చెప్పేశారట. ఇప్పుడు మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసుల పేరు అనుకుంటున్నా.. తాజాగా పురపాలిక ఫలితాలు చూసి ఆయన కూడా వెనకంజ వేస్తున్నారని అంటున్నారు. పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కదన్న ఆందోళన ఆ పార్టీ వర్గాలను వెంటాడుతోంది.
ఇక తెలంగాణలో దుబ్బాక విజయం.. గ్రేటర్ ఎన్నికల్లో అంచనాలకు మించిన విజయంతో బీజేపీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీని కవ్విస్తూ వస్తోంది. నోటిఫికేషన్ రావడానికి ముందు వరకు రంకెలేసిన బీజేపీ తీరా నోటిఫికేషన్ వచ్చాక ఎవరిని పోటీ పెట్టాలో తెలియక గందరగోళంలో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ జానారెడ్డిని ప్రకటించేసింది. ఇటు టీఆర్ఎస్ కూడా దుబ్బాక దెబ్బతో ముందుగా అభ్యర్థిని ప్రకటించకుండా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాక తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిద్దామని వేచి చూసే ధోరణితో ఉంది.
దుబ్బాకలో సీన్ రిపీట్ అవుతుందేమోనని అధికార పార్టీలో భయం కనిపిస్తోంది. అయితే.. అప్పుడు దుబ్బాక ఎన్నిక నేపథ్యం వేరు. ఇప్పుడు సాగర్ ఎన్నిక నేపథ్యం వేరు. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. గత సాధారణ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కాదు కదా కనీసం 2 వేల ఓట్లు కూడా రాలేదు. ఇలాంటి చోట బీజేపీ సవాల్ చేసి కవ్వించింది. ఇప్పుడు బలమైన అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి. ఏదేమైనా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎన్నికల ముందే సరైన అభ్యర్థులే లేరు. దీనికితోడు డిపాజిట్లు కూడా వస్తాయో లేదోనన్న అనుమానం కలుగుతోంది.