Nirmala Sitharaman : నిర్మలమ్మ సెంటిమెంట్ అస్త్రాలు.. వర్కవుట్ అవుతాయా?

కర్నాటక ప్రజలు సహృదయంతో అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు. మైసూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమె  షాకింగ్ కామెంట్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అయితే విపక్షాలు మాత్రం అవన్నీ చీప్ ట్రిక్స్ గా కొట్టి పారేస్తున్నాయి.

Written By: Dharma, Updated On : April 27, 2023 1:59 pm
Follow us on

Nirmala Sitharaman : దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. అక్కడ మరోసారి అధికారంలోకి రావడానికి ఆ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. హేమాహేమీలను రంగంలోకి దించింది. దాదాపు దేశ వ్యాప్తంగా ఉన్న కాషాయ దళాన్ని అక్కడ మోహరించింది. కానీ ధరల ప్రభావం అక్కడ ప్రభావితం చేస్తోంది. విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ధరల పెరుగుదల పతాక స్థాయికి చేరుకుందని అటు కాంగ్రెస్, ఇటు జేడీఎస్ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏంచెప్పాలో పాలుపోక సతమతమవుతోంది. కనీసం ఈ అంశం నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నా వీలుపడడం లేదు. ధరల ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

వకల్తా తీసుకున్న మంత్రి..
అయితే ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వకల్తా పుచ్చుకున్నారు. విపక్షాలకు కనువిప్పు కలిగేలా..ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ధరల పెరుగుదల విషయంలో  సెంటిమెంట్ అస్త్రాలను సంధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న అపవాదును తొలగించే ప్రయత్నం చేశారు. కర్నాటక ప్రజలు సహృదయంతో అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు. మైసూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమె  షాకింగ్ కామెంట్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అయితే విపక్షాలు మాత్రం అవన్నీ చీప్ ట్రిక్స్ గా కొట్టి పారేస్తున్నాయి. ధరల పెరుగుదలకు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపిస్తున్నాయి.

నిట్టూర్పు మాటలు..
ఒకసారి నిర్మలాసీతారామన్ మాటలను పరిశీలిస్తే.. ‘సామాన్యులు ఎలా బతుకుతున్నారా? అని నాకు కూడా అనిపిస్తోంది.  నిజంగానే ధరలు మండిపోతున్నాయి. మేం.. ధరలు తగ్గించలేదని కొందరు చెబుతున్నారు. ఇది చాలా తప్పు!  మేం ఏం చేస్తున్నామో.. సామాన్యులకు తెలుసు. కేంద్రం  ధరలు తగ్గించేందుకు అనేక రూపాల్లో చర్యలు తీసుకుంటోంది.  కానీ సీజనల్ వస్తువుల రవాణా కారణంగానే ధరలు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ .. మమ్మ ల్ని అర్థం చేసుకున్నారు. ప్రతిపక్షాలే అర్ధం చేసుకోవడం లేదు. కరోనా సమయంలో కొన్ని దేశా ల్లో పెట్రోల్ బంక్లు మూసేశారు. మనదగ్గర మూసేయలేదు. కాబట్టి.. మనది ప్రజా ప్రభుత్వం. ధరలు ఈ రోజు ఉంటాయి.. రేపు తగ్గుతాయి. కేంద్రం శాశ్వతం’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

దుమారం..
అయితే ఆమె మాటలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఓ దేశానికి ఆర్థిక మంత్రి అయి ఉండి పరిపక్వత లేని వ్యాఖ్యలు చేయడం దారుణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని చెబుతున్నాయి. ఓ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలను మాట్లాడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇదే విషయాలను జాతీయ వేదికల్లో చెప్పొచ్చు కదా అని నిలదీస్తున్నాయి. మొత్తానికై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నిట్టూర్పు మాటలు చూస్తుంటే సామాన్యులకు సైతం కన్నీరు తెప్పిస్తోంది. ఇక కర్నాటక ఓటరు కరుగుతాడో? లేదో? చూడాలి మరీ.