
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం ఎంతలా అతలాకుతలమైపోయిందో అందరికీ తెలిసిందే. దేశాలన్నీ ఆర్థికంగా అతలాకుతలం అయిపోయాయి. మన దేశంపై కరోనా చూపించిన ప్రభావం అంతా ఇంతాకాదు. సెకండ్ వేవ్ లో ప్రపంచంలోనే మరే దేశంపైనా ఈ స్థాయిలో దాడి చేయలేదు. దీంతో.. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. వృద్ధిరేటు ఊహించని రీతిలో పతనమైపోయింది.
ఈ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన రంగాలకు ఊతం ఇచ్చేందుకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా కారణంగా నాశనమైన రంగాలను ఆదుకునేందుకు రూ.1.1 లక్షల కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్ ను ప్రకటించింది. కరోనా తొలి దశలో విధించిన సుదీర్ఘ లాక్ డౌన్ తో పెను ప్రభావం చూపింది. అప్పుడు రూ.30 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పుడు సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.
దీంతోపాటు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం కింద మరో రూ.1.5 లక్షల కోట్లను ప్రకటించారు. అదేవిధంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మౌలిక సదుపాయల కల్పనపై దృష్టి పెట్టినట్టు తెలిపారు మంత్రి. ఇందుకోసం రూ.50 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా రూ.1.25 లక్షల కోట్ల రుణాలను కూడా అందించనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా.. రుణమాఫీ పథకం కింద తీసుకున్న రుణాలకు వడ్డీ రేటు 7.95 శాతంగా నిర్ణయించినట్టు చెప్పారు.