Nipah virus is more dangerous than corona virus.: ఈ గబ్బిలాలు ఉన్నాయే.. మనిషికి ప్రాణాంతక వ్యాధులను కలుగజేస్తున్నాయి. ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనాకు గబ్బిలాలే కారణం అని తెలిసింది. ఇప్పుడు భారత్ లో వెలుగుచూసిన కొత్త డేంజర్ వైరస్ ‘నిఫా’కు కూడా ఇదే గబ్బిలాలు వాహకాలన్న విషయం కలవరపెడుతోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇప్పుడు దానికి తోడు మరో వైరస్ ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. ఏకకాలంలో రెండు వైరస్ లతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ భీకరంగా వ్యాపిస్తుండగా.. తాజాగా నిఫా వైరస్ కేసులు కేరళలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండూ వైరస్ లు గబ్బిలాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కానీ వీటి లక్షణాలు, రోగి ఆరోగ్య సమస్యలు భిన్నంగా ఉండడంతో గుర్తించడం చాలా కష్టం అవుతోంది. నిఫా వైరస్ కు చికిత్స, మందులు కూడా లేకపోవడంతో ప్రాణాంతకంగా మారుతోంది.
నిఫా వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని తేలింది. నిఫా వైరస్ ను 1999లో గుర్తించారు. మలేషియా దేశంలోని సున్ గాయ్ నిఫా గ్రామంలో బయటపడడంతో ఆ గ్రామం పేరుపై ‘నిఫా వైరస్’ అని పెట్టారు. గబ్బిలాలు, పందులు, కుక్కలు, గొర్రెలు, గుర్రాలలో సోకి మనుషులకు వ్యాపించింది. గబ్బిలాల నుంచే ఇవి ఇతర జంతువులకు వ్యాపించి మనుషులకు సంక్రమించాయని తేలింది.
నిఫా వైరస్ కు అసలు ఇప్పటివరకు వైద్యం అంటూ లేదు. చికిత్సకు ఔషధాలు అందుబాటులోకి రాలేదు. రోగిని వేరుగా ఉంచి యాంటీ బాడీస్ ఇస్తున్నారు. బతికితే బతుకుతారు. చస్తే చస్తారు. వారి ఆరోగ్య సామర్థ్యమే తప్పితే నయం చేసే మందు లేదు. ఈ వ్యాధి సోకితే శ్వాస సమస్యలు, మెదడు సమస్యలు, మొదట జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కోవిడ్ 19 వైరస్ తో పోల్చితే నిఫా వైరస్ చాలా డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన వారిలో 45 శాతం నుంచి 70శాతం మరణిస్తుండడం కలవరపెడుతోంది. కేరళలో 19మందికి సోకితే ఏకంగా 17 మంది మరణించడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. అందుకే ఇప్పుడు కరోనా తర్వాత నిఫా వైరస్ దేశాన్ని ప్రపంచాన్ని కలవరపెట్టే వ్యాధిగా మారిపోయిందన్న ఆందోళన నెలకొంది.