NIA Raids: తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ ప్రాంతంలో మొన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహించారు కదా.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు కదా. విచారణలో వారు ఏం తెలుసుకున్నారు తెలియదు గాని.. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మీడియా అత్యుత్సాహం తగ్గిన తర్వాత.. సైలెంట్ గా తమ పని ప్రారంభించారు. సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఒకేసారి జూలు విధిల్చారు. తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో 60 కి పైగా ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. తమకు అందిన సమాచారం ఆధారంగా అనుమానితుల ఇళ్లల్లో కి నేరుగా ప్రవేశించి అక్కడ సోదాలు జరుపుతున్నారు. ఏపీ, తెలంగాణలోని పౌర హక్కుల నేతలు, అమర బంధుమిత్రుల సంఘం నాయకుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాలు ఉన్న కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నామని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.
అధికారులు నిర్వహించిన సోదరులలో ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి అని మీడియా ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తున్నారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాలు ఉన్న కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నామని చెబుతున్న ఎన్ఐఏ అధికారులు.. హైదరాబాదులోని భవాని, న్యాయవాది సురేష్ ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్ పేట లో ఎల్లంకి వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కావలి బాలయ్య ఇంట్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. గతంలో బాంబు పేలుడు కేసుకు సంబంధించి బాలయ్య కుమార్తె పద్మ, ఆమె భర్త శేఖర్ నిందితులుగా ఉన్నారు.
ఇక గుంటూరు జిల్లా కొండపాటూరులో తమలపాకుల సుబ్బారావు, జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకటరావు, సంత మాగులూరులో ఓరు శ్రీనివాసరావు, రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో పౌర హక్కుల నేత నాజర్, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి కోణాల లాజర్, శ్రీకాకుళంలోని మిస్క కృష్ణయ్య ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కృష్ణయ్య ఆముదాలవలస మండలం తోటపాట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మరో వైపు అనంతపురంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంటిలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎటువంటి ఆధారాలు అధికారులు సేకరించారు, తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పడం లేదు. పైగా తనిఖీల సమయంలో స్థానికంగా ఉన్న పోలీసుల సహాయం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తీసుకుంటున్నారు. కాగా, తనిఖీల సమాచారాన్ని అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏదో జరుగుతోంది అనే భయం స్థానికుల్లో నెలకొంది.