జగిత్యాల (Jagitial) జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్ కు చెందిన బాబాకు మూడు రోజుల క్రితమే ఓ యువతితో పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య వేడుక ఘనంగా నిర్వహించారు. కొత్త జీవితాన్ని ఆస్వాదించాలని కలలు కన్న జంటకు చుక్కెదురైంది. వివాహం (Marriage) జరిగిన మరుసటి రోజే భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు రావడంతో గొడవ జరిగింది. అది కాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది. దీంతో పోలీసులు వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. సజావుగా కాపురం చేసుకోవాలని సూచించి ఇంటికి పంపించారు.
అయినా వారిలో మార్పు రాలేదు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా వారి తీరు మారలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన వరుడు కత్తితో గొంతు, వీపు భాగంలో కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమైన అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే పెళ్లయిన మూడు రోజులకే వరుడు ఎందుకు ఆత్మహత్యాయత్నం (Suicide) చేశాడు? ఇద్దరిలో ఏం విభేదాలున్నాయి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొత్త జంట ఇలా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయని విచారణ చేపడుతున్నారు. ఇద్దరి మధ్య ఎందుకు తగాదాలు వస్తున్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు కుటుంబాలను పిలిపించి మాట్లాడుతున్నారు. పెళ్లయిన మూడు రోజులకే ఇలా జరగడంపై అందరిలో ఆందోళన నెలకొంది.