TDP And Janasena- BJP: ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. పొత్తుల పొరలు విప్పుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే దానిపై ఒక స్పష్టత వస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎటు అన్నదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. చంద్రబాబుతో పవన్ భేటీ తరువాత దీనిపై స్పష్టత వచ్చింది. పైగా ఎన్నికల పొత్తులు, వ్యూహాలపై ఇరువురు నేతలు బహిరంగంగానే మీడియా ముందే మాట్లాడారు. ఇక మిగిలింది బీజేపీ. కానీ ఇప్పటివరకూ ఆ పార్టీ నుంచి ఎటువంటి స్పష్టత లేదు. ఎన్నికలకు సమయం ఉండడంతో బీజేపీ కోసం వేచిచూడాలని అటు పవన్, ఇటు చంద్రబాబు డిసైడయినట్టు సమాచారం. అయితే ఇప్పటికీ బీజేపీ తన మిత్రపక్షంగా పవన్ పేర్కొనగా.. టీడీపీతో కలిసి నడిచేందుకు బీజేపీ ఇష్టపడుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

అయితే ఈ విషయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేనల కలయిక ప్రభంజనంగా చెప్పుకొచ్చారు. ఈ రెండు పార్టీలతో మరో పార్టీ వచ్చి చేరుతుందంటూ పరోక్షంగా బీజేపీ ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబుతో పవన్ భేటీ తరువాత వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారని చెప్పుకొచ్చారు. తమ పార్టీ నేతల ఫ్యాంట్లు తడిసిపోయాయంటూ కామెంట్స్ చేసిన రఘురామరాజు ఇప్పుడు మూడో పార్టీ అంటూ బీజేపీ ప్రస్తావన తేకుండానే టీడీపీ, జనసేనతో కలుస్తుందని చెప్పుకురావడం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో మరింత హీట్ పెంచింది. అయితే బీజేపీకి ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీ, జనసేన అని.. లేకుంటే వైసీపీ వైపు వెళ్లాల్సి ఉన్నా అది సాధ్యమయ్యే పనికాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఎన్నికల తరువాత బీజేపీ, జనసేన మధ్య అవగాహన కుదిరింది. జగన్ సర్కారుపై సంయుకత్త పోరాటాలకు ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. కానీ వారెప్పుడు కలిసి పోరాడింది లేదు. పైగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కదలికలపై వారు పెద్దగా స్పందించడం లేదు. టీడీపీతో పొత్తు అనేసరికి విముఖత చూపుతున్నారు. ప్రసక్తే లేదని చెబుతున్నారు. అయితే ఆ విషయంలో రాష్ట్ర నాయకత్వం బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండగా.. ఢిల్లీ హైకమాండ్ పెద్దలు మాత్రం గుంభనంగా ఉన్నారు. అందుకే వారి నుంచి స్పష్టత వచ్చే వరకూ వేచిచూడాలని పవన్, చంద్రబాబులు చూస్తున్నారు.

తాజాగా చంద్రబాబు, పవన్ భేటీలపై కూడా బీజేపీ నేతలు రియాక్టు కాలేదు. విశాఖ ఘటన తరువాత పవన్ ను చంద్రబాబు కలిసినప్పుడు బీజేపీ నేతలు కొద్దిపాటి కలవరానికి గురయ్యారు. పవన్ ను కలిసి సంఘీభావం తెలిపారు. అయితే ఇప్పుడు పవన్ చంద్రబాబును కలిసిన లైట్ తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు పరామర్శించినందున.. ఇప్పుడు కుప్పంలో ఆయన్ను అడ్డుకోవడంతో పరామర్శించి ఉంటారని సర్దుబాటు మాటలు చెబుతున్నాయి. అయితే విలేఖర్ల సమావేశంలో పొత్తులు, వ్యూహాలపై పవన్ మాట్లాడారు. దానికి సమయం ఉందని.. మా వ్యూహాలు మాకు ఉంటాయని పొత్తులపై స్పష్టమైన సంకేతాలిచ్చారు.
అయితే టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలు అచీతూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో టీడీపీని యాక్టివ్ చేసి.. అక్కడ సహకరించడం ద్వారా.. ఏపీలో బీజేపీ సహకారం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో టీడీపీ సపోర్టు అవసరం లేదని అక్కడి బీజేపీలోని కొంతమంది నాయకులు హైకమాండ్ కు నివేదించినట్టు తెలుస్తోంది. దాని పర్యవసానమే బీజేపీ నేతల మౌనానికి కారణాలుగా తెలుస్తోంది. అయితే ఢిల్లీ రాజకీయాలపై అవగాహన కలిగిన నేత అయిన రఘురామరాజు నోట నుంచి కూటమిలో మరో పార్టీ అన్న మాట వచ్చేసరికి బీజేపీ అయి ఉంటుందని.. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది.