
ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పీఆర్సీ పెంపునకు ఆమోద ముద్ర వేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 9 లక్షల 21 వేల 37 మంది ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితోపాటు పింఛన్ దారులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ అమలు కాబోతోంది. ఈ నిర్ణయం ప్రకారం ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలుపైనే ఉండనుంది. పెరిగిన వేతనాలు జూన్ నుంచి అందుకోనున్నారు.
పించనర్లకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం 36 వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రకటించింది. 2018 జులై తర్వాత పదవీ విరమణ చేసిన వారు కూడా 2020 పీఆర్సీ ప్రకారమే పింఛన్లు పొందుతారని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. కనీస పింఛన్ రూ.6,500 నుంచి 9,500 వరకు పెరగనుంది. ఇక, రిటర్మైంట్ గ్రాట్యుటీ గరిష్టంగా రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెన్షన్ దారుడితోపాటు అతని కుటుంబ సభ్యుల మెడికల్ అలవెన్స్ నెలకు రూ.600 పెంచుతున్నట్లు పేర్కొంది.
ఇక, హెచ్ ఆర్ ఏను ప్రాంతాల వారీగా వర్గీకరించింది. గ్రేటర్ పరిధిలో 24 శాతానికి తగ్గనుండగా.. ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్ ప్రాంతాల్లో 17 శాతంగా నిర్ణయించింది. 50 వేల నుంచి 2 లక్షల మధ్య జనాభా ఉన్న పట్టణాల్లో 13 శాతం, ఇతర ప్రాంతాల్లో 11 శాతంగా నిర్ణయించింది.