రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే.. ఒకవైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి రెండూ సమాంతరంగా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే.. ఏపీ విషయానికి వచ్చే సరికి సర్కారు కేవలం సంక్షేమం మీదనే దృష్టి సారించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధి గురించి కనీసంగా కూడా పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి.. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తున్నదే. జగన్ పాలన మొదలై సగం పాలన పూర్తికావచ్చినా.. ఇప్పటి వరకూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలేవీ రాలేదు. పైగా.. గతంలో వచ్చినవి వెనక్కు వెళ్లిపోవడం మరింత దారుణం. ఈ పరిస్థితికి కారణమేంటీ? అనే చర్చ గట్టిగానే కొనసాగుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి రిలయన్స్ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను నెలకొల్పేందుకు తిరుపతి సమీపంలో స్థలం కూడా కేటాయించింది అప్పటి సర్కారు. అదేవిధంగా.. అదానీ మెగా డేటా హబ్, లులూ గ్రూప్ విశాఖలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఓకే చెప్పేశాయి. అయితే.. వివాదంలో భూములు ఇచ్చారంటూ ఈ కంపెనీలు ఒక్కొక్కటిగా వెనక్కు వెళ్లిపోవడం గమనార్హం. రిలయన్స్ కు ఇచ్చిన భూములపై పలువురు కోర్టుకు వెళ్లారు. దీంతో.. ఎందుకొచ్చిన తంటా అని నిర్ణయం మార్చుకుంది ఆ సంస్థ. మిగిలిన రెండు కూడా ఇదే పద్ధతిలో వెనక్కు వెళ్లాయని సర్కారు చెబుతోంది.
ఒకవేళ నిజమే కావొచ్చు కూడా.. గత ప్రభుత్వం కేటాయించిన భూముల్లో వివాదం ఏర్పడింది. అప్పుడు ఈ సర్కారు చేయాల్సింది.. ఏదో ఒకటి చేసి, ఆ పరిశ్రమలను ఇక్కడే ఏర్పాటు చేసేలా చేయడమే కదా? అలా చేయకుండా.. వచ్చిన పరిశ్రమ వెళ్లిపోయిందని, దానికి గల కారణాలను చెబితే ఎవరికి కావాలి? అన్నది ప్రశ్న. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పరిశ్రమలను ఆహ్వానిస్తుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు.. పన్నుల వంటి వాటి ద్వారా ఆదాయం పెరుగుతుంది. తద్వారా అభివృద్ధి జరుగుతుంది. కానీ.. ఏపీ సర్కారు ఈ విషయంలో సీరియస్ గా లేదని, అందుకే వచ్చిన కంపెనీలు వెళ్లిపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక, కొత్తగా వచ్చే పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ సంస్థ అయినా.. లాభం కోసమే పనిచేస్తుంది. కాబట్టి.. అలాంటి కంపెనీల ద్వారా రాష్ట్రానికి జరిగే లాభమేంటన్నది చూసుకుంటూనే వారికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం కూడా కంపెనీలకు భారంగా మారిందనే అభిప్రాయం ఉంది.
రాష్ట్రంలోకొత్తగా పరిశ్రమలు పెట్టేవారు ఖచ్చితంగా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిబంధన విధించింది ప్రభుత్వం. ఇది కూడా పరిశ్రమలు రాకను అడ్డుకుంటోందని అంటున్నారు. పైకి చూడ్డానికి రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న మంచి నిర్ణయంగా అనిపించొచ్చుగానీ.. కంపెనీ తరపు నుంచి చూసినప్పుడు ఇది ఇబ్బందికరమైన నిబంధనే అని అంటున్నారు నిపుణులు. ఏ కంపెనీ అయినా.. తనకు పనికివచ్చే స్కిల్ ఉన్న ఉద్యోగులను ఎంపిక చేసుకుంటుంది. మరి, ఈ నిబంధన విధిస్తే.. స్కిల్ విషయంలో తలొగ్గి మరీ ఉద్యోగాలు స్థానికులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందనే భయం కంపెనీల్లో ఉందని అంటున్నారు.
దీంతోపాటు మూడు రాజధానుల అంశం కూడా గందరగోళానికి కారణమైందని అంటున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ కొత్త పరిశ్రమలు పెట్టాలి? ఆయా ప్రాంతాల్లో భవిష్యత్ అభివృద్ధి ఎలా ఉంటుంది? అనేది పూర్తిగా అర్థంకాక ఏపీకి ముఖం చాటేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విధమైన పలు సమస్యల కారణంగానే కొత్త పరిశ్రమలు రావట్లేదని, ఉన్నవి పోతున్నాయని అంటున్నారు.