
గాయత్రి భార్గవి నటిగా కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. ఆలాగే బుల్లితెర యాంకర్ గా సుదీర్ఘ కాలంగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా గాయత్రి భార్గవి పోలీసులను ఆశ్రయించారు. కారణం.. ఆమె ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేశారట. పైగా భార్గవి అకౌంట్ నుండి ఆమె పేరుతో కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారని.. అలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు పెడుతున్నారని భార్గవి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా గాయత్రి భార్గవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ‘నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ప్రస్తుతం నా ఎకౌంట్ లో మత విద్వేషాలు కలిగించే మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఆ పోస్ట్ లు ఎందుకు పెడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. అలాగే కొన్ని అసభ్యకరమైన మెసేజ్ లు కూడా పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. ఆ పోస్ట్ లతో నాకు ఎటువంటి సంబంధం లేదు.
అలాగే నా ఎకౌంట్ లో ప్రస్తుతం పోస్ట్ అవుతున్న మెసేజ్ లను ఎవరు షేర్ చేయకండి. అలాగే వాటిని పట్టించుకోకండి అంటూ ఆమె విజ్ఞప్తి చేస్తూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఈ మధ్య సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. ఇంతకీ భార్గవి అకౌంట్ ను హ్యాక్ చేసిన వారు ఎవరో తెలియాల్సి ఉంది.
అయినా అకౌంట్ హ్యాక్ చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టే అవసరం ఎవరికీ ఉంది ? ఇప్పటికైనా ప్రముఖులు సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక గాయత్రి భార్గవి అకౌంట్ ను వెంటనే రికవరీ చేసేందుకు గానూ ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. భార్గవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కూడా నటిస్తోంది.