Andhra Pradesh BJP : ఏపీ విషయంలో బిజెపి క్లారిటీ ఇవ్వడం లేదు. తెలుగుదేశం, జనసేనలు మాత్రం అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఏకంగా 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 19 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ లెక్కన మిగిలి ఉన్నది 57 స్థానాలు. వీటిలో బిజెపికి ఇచ్చే సీట్లు ఎన్ని? అన్నదే ఇప్పుడు ప్రశ్న. కానీ బిజెపి అగ్ర నేతల నుంచి ఎటువంటి స్పందన లేదు. టిడిపి,జనసేనలు మాత్రం కేంద్ర పెద్దలను ఆశ్రయించి తాము సీట్లు ప్రకటించినట్లు చెబుతున్నారు.బిజెపి తప్పకుండా కూటమిలోకి వస్తుందని చెప్పుకొస్తున్నారు.
మరోవైపు బిజెపి రాష్ట్ర నాయకులు సైతం చాలామంది టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు.పొత్తులో భాగంగాతమకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే బిజెపిలో కొత్తగా చేరికలు చూసి ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పారిశ్రామికవేత్తలు, ఆర్థిక స్థితిమంతులు బిజెపిలో చేరుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇలా చేరిన వారు అభ్యర్థిత్వలను ఆశిస్తుండడం విశేషం.అయితే ఈ పరిణామాలను గమనిస్తున్న బిజెపి నేతలకు మాత్రం మింగుడు పడడం లేదు.
పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ స్థానం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అక్కడ జనసేన నాయకుడు పోతిన మహేష్ ఉన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తూ వచ్చారు. పొత్తులో భాగంగా ఈ సీటు ఎలాగైనా జనసేనకు కేటాయిస్తారని విశ్లేషణలు ఉన్నాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు బుద్ధ వెంకన్న ఇదే అనుమానంతో విజయవాడ పశ్చిమ స్థానంతో పాటు అనకాపల్లి పార్లమెంట్ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కచ్చితంగా జనసేనకు ఈ సీట్ కేటాయిస్తారని అంచనా ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపిలోకి ఎన్నారై గొలగాని రవికృష్ణ చేరారు. పురందేశ్వరి ప్రత్యేక చొరవ చూపి ఆయన పార్టీలో చేర్చారు. దీంతో ఏపీలో పొత్తుల లెక్కల్లో ఎక్కడో అనుమానం వస్తోంది. ఈ స్థానం జనసేనకు కేటాయిస్తారని చెబుతుండగా.. బిజెపిలోకి నేతలను రప్పించడం పై అనుమానాలు ఉన్నాయి.
ఏపీలో బిజెపికి బలం లేకపోయినా పొత్తులో ఆ పార్టీకి కీ రోల్ ప్లే చేస్తోంది. అటువంటి పార్టీ లేకుండా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన ఎలా సాధ్యమని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. లోలోపల ఏదో జరుగుతోందని అనుమానిస్తున్నారు. ఒకవైపు పొత్తులకు సై అంటూనే.. మరోవైపు బిజెపి ఒంటరి పోరుకు సిద్ధమైందా? అన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయి. అందులో భాగంగానే ఎన్ఆర్ఐ లను, పారిశ్రామికవేత్తలను పార్టీలో చేర్చుకుంటున్నారన్న టాక్ అయితే ఉంది. టిడిపి,జనసేన నేతలు మాత్రం బిజెపి తప్పకుండా తమతో కలిసి వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.