సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆధునాతన హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. ఇందుకు తగ్గట్టుగానే సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.500కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. పాత సచివాలయాన్ని పడగొట్టి కొత్తది నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు, ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?
పాత సచివాలయం కూల్చివేతకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రభుత్వం యంత్రాంగం పనులను మొదలుపెట్టారు. సచివాలయ మార్గంలో వెళ్లే వాహనాలను దారిమళ్లించి కూల్చివేత పనులను ప్రభుత్వం షూరు చేసింది. ఇప్పటికే దాదాపు 60శాతం కూల్చివేత పనులు పూర్తయినట్లు సమాచారం. అయితే సచివాలయంలోని గుడి, మసీదులపై సచివాలయ శిథిలాలు పడిపోవడంతో ఆ నిర్మాణాలు కూలిపోయాయి. ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సచివాలయ నిర్మాణంతోపాటు కూలిపోయిన గుడి, మసీదులను కూడా కొత్తగా నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు.
అయితే తాజాగా మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. కొత్త సచివాలయ నిర్మాణంలో గుడి, మసీదుతోపాటు చర్చి కూడా నిర్మించాలని తెలుగు చర్చిల ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. పాత సచివాలయంలో కే బ్లాకులో ప్రతీ బుధవారం చర్చి సేవలను నిర్వహిస్తున్నారని వారు గుర్తుచేస్తున్నారు. 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చర్చి హాల్ ను ప్రారంభించారని చెబుతున్నారు. ఈ చర్చి సేవలు ఇటీవల వరకు సాగించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సచివాలయంలోని అన్ని బ్లాకులు కూల్చివేస్తుండటంతో గుడి, మసీదుతోపాటు చర్చిని కూడా సీఎం కేసీఆర్ నిర్మించాలని కోరుతున్నారు.
మరోసారి సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్..!
ఇదిలా ఉంటే సచివాలయం కూల్చివేతకు హైకోర్టు మరోసారి బ్రేక్ వేసింది. ఈనెల 15వరకు సచివాలయాన్ని కూల్చివేయద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ప్రస్తుతానికి సచివాలయ కూల్చివేతకు బ్రేకులు పడినప్పటికీ త్వరలోనే సీఎం అనుకున్నట్లుగా కొత్త సచివాలయం నిర్మాణం జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. తాజాగా చర్చిని కూడా నిర్మించాలని డిమాండ్ వస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కన్పిస్తుంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.