
New Bride Note: మహిళల కోసం ఎన్ని చట్టాలు తెస్తున్నా అవి నెరవేరడం లేదు. వారి ఆశలు తీర్చడం లేదు. మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచి నూరేళ్లు తోడుంటానని బాసలు చేస్తున్నా మధ్యలో మనసు మార్చుకుని వేధింపులకు గురి చేస్తున్నారు. అదనపు కట్నం ఆశతో పెళ్లాన్ని కష్టాలపాలు చేస్తున్నారు. చిత్రహింసలు పెడుతూ గొడవలు చేస్తున్నారు. వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకు తల్లిదండ్రుల తరువాత భర్తే సర్వస్వం అని భావిస్తోంది. కానీ కట్నం కోసం కట్టుకున్న ఆలినే కడతేర్చేందుకు వెనుకాడడం లేదు.
కడప నగరంలోని నెహ్రూ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కట్నం కోసం వేధించడంతో తనువు చాలించింది. భర్త, అత్తమామలు పెడుతున్న చిత్రహింసలు భరించలేక లోకాన్ని విడిచిపెట్టింది. కడపకు చెందిన 26 ఏళ్ల ఝాన్సీకి, రాజంపేట బోయినపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణతో గత నెల 15న పెళ్లి జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద రూ.15 లక్షలు అందజేశారు. కానీ పెళ్లయిన రెండో రోజు నుంచే వేధింపులు ప్రారంభమయ్యాయి. రూ.70 లక్షలు ఇస్తేనే బావుంటుందని ఈనెల 2న అత్తమామలు ఝాన్సీని పుట్టింటికి పంపించారు.
దీంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా రాధాకృష్ణ మాత్రం రూ.70 లక్షలు ఇస్తేనే సంసారానికి రావాలని చెప్పడంతో కలత చెందిన ఝాన్సీ అవమానంగా భావించి ఇక తాను బతికి ఉండి ఏం లాభం అనుకుని ఉరి వేసుకుంది. కుటుంబసభ్యులు గమనించే సరికి ప్రాణాలు తీసుకుంది. దీంతో రిమ్స్ కు తరలించారు. అప్పటికే ప్రాణాలు పోయాయని వైద్యులు ప్రకటించారు.
ఝాన్సీ సూసైడ్ నోటు రాసింది. తన చావుకు తన భర్త, అత్త మామలే కారణమని పేర్కొంది. వరకట్నం కోసమే తాను తనువు చాలించినట్లు చెప్పింది. పోలీసులు సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. తన తల్లిదండ్రులను కాపాడాలని కోరింది. తన కుటుంబానికి భవిష్యత్ లో ఎలాంటి ఆపద రాకుండా చూడాలని ప్రాధేయపడింది. దీంతో వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.