రాజకీయాల్లో హత్యలుండవంటారు.. ఆత్మహత్యలే ఉంటాయి. పొత్తుల ఎత్తుల్లో చిత్తవడమే ఉంటుంది. అలాగే ఒకప్పుడు దేశంలో బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఇప్పుడు తెలుగు నాట అయితే తోకపార్టీలుగా తయారయ్యారు. ఒంటరిగా గెలిచే సత్తా వారికి లేదు. అలాగే ఏదో పార్టీతో పోత్తు పెట్టుకొని నెట్టుకురావడం తప్పితే మరో మార్గం లేదు.
ఖమ్మం గుమ్మంలో ఇప్పుడు పొత్తుల ఎత్తులు మొదలయ్యాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కొత్త పొత్తులు నెలకొంటున్నాయి. ఇప్పటికే బీజేపీతో విడిపోయిన జనసేన తాజాగా మళ్లీ ఏకమై పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగింది.
ఈ క్రమంలోనే ఖమ్మంపై ఫోకస్ పెట్టిన గులాబీ దండు అధికారంలో ఉండి కూడా కొత్త పొత్తు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఖమ్మంలో ఎప్పుడూ టీఆర్ఎస్ కు అంత బలం లేదు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్కసీటులో మాత్రమే గెలిచింది. 2014లోనూ అదేపరిస్థితి.
అందుకే ఇప్పుడు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ బలమైన కమ్యూనిస్టు పార్టీ సీపీఐతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. నిజానికి టీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ సీపీఐ నుంచే ఎదిగారు. ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు ఖమ్మం రాజకీయాల్లో దిగ్గజ కమ్యూనిస్టు నేత. ఆయన అడుగుజాడల్లో రాజకీయాల్లో వచ్చిన అజయ్ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ లో చేరి తర్వాత టీఆర్ఎస్ లోకి మారి ఖమ్మలో ఒకే ఒక్కడు గెలవడంతో లక్కీగా మంత్రి అయ్యారు.
అయితే ఖమ్మంలో ఇప్పటికీ కమ్యూనిస్టులకు బలమైన క్యాడర్, నాయకులు ఉన్నారు. అందుకే వారి ఓట్ల కోసం వ్యూహాత్మకంగా అధికార టీఆర్ఎస్ సీపీఐతో పొత్తు పెట్టుకుంది. వీరి పొత్త ఖచ్చితంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ పార్టీని కాపాడుతుందన్న భరోసా టీఆర్ఎస్ పార్టీలో ఉంది.