ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నిన్నటితో ముగిసింది. దీంతో కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్నీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ప్రభుత్వ సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా చేశారు. ఐదేళ్లపాటు ఎస్‌ఈసీగా నీలంసాహ్ని బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఎస్ఈసీ హోదాలో అధికారులతో తొలి సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే.. తొలి సమావేశంలోనే ఆమె జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై వైఖరి వెల్లడించబోతున్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆఫీసర్లతో చర్చిస్తున్నారు. ఆమె తొలి ప్రెస్ మీట్‌లోనే ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి.. ఏప్రిల్ 8, 10న ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహిస్తారని భావించారు. కానీ.. ఆయన మాత్రం ట్విస్ట్ ఇచ్చారు.
తాను జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రకటించారు. తన పదవీ కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను షెడ్యూల్ విడుదల చేయలేను అన్నారు. తన తదుపరి వచ్చేవారు ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. హైకోర్టు తీర్పు, ఎన్నికల కోడ్ కారణంగా నిర్వహించలేమన్నారు. అయితే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారంపై హైకోర్టులో కూడా విచారణ జరుగుతుండటంతో నీలం సాహ్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీకి ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబుతో పాటు ఇతర సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడిన నీలం… తనకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నర్ హరిచందన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. స్ధానిక సంస్ధల ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఎస్ఈసీ నీలం సాహ్నీ పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో ఎన్నికలను నిర్వహిస్తానన్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్