Indian Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు ఊరట లభించింది. రాజ్యసభ ఎన్నికల తాజా ఫలితాలతో ఎగువ సభలో ఎన్‌డీఏ బలం 117కి చేరడంతో బీజేపీలో కదనోత్సాహం రెట్టింపైంది. 245 మంది సభ్యుల సభలో 233 మంది రాష్ట్రాల శాసనసభల ద్వారా ఎన్నికయ్యే సంగతి తెలిసిందే. వీరికి మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కుంది. రాష్ట్రపతి నామినేట్ చేసే మిగతా 12 మంది ఓటువేయడానికి వీల్లేదు. 57 స్థానాలకు ఇటీవల ద్వైవార్షిక ఎన్నికలు జరుగగా.. వాటిలో తనకున్న 24 స్థానాలను బీజేపీ నిలబెట్టుకోదని.. 20 మాత్రమే వస్తాయని అంతా భావించారు. కానీ కర్ణాటక, మహారాష్ట్రలో ఆ పార్టీ రెండు సీట్లు అదనంగా దక్కించుకుని మొత్తంగా 99 స్థానాలు సాధించింది. అలాగే హరియాణాలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. యూపీఏకి ఇప్పుడు రాజ్యసభలో 53 మంది సభ్యులున్నారు.

టీఎంసీ(13), ఆప్(10), వైసీపీ(9), బీజేడీ(9), టీఆర్‌ఎస్(7), ఆర్‌జేడీ(6), సీపీఎం(5), సమాజ్‌వాదీ(3), సీపీఐ(2), టీడీపీ (1) సహా ఇతరులకు 71 మంది ఎంపీలున్నారు. వైసీపీ, బీజేడీ మద్దతుతో తన బలం 135కి చేరుతుందని.. ఏకసభ్య పార్టీలు కూడా కొన్ని కలిసొస్తాయని.. ప్రతిపక్షాల్లో ఐకమత్యం లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తేలిగ్గా గెలవగలమని బీజేపీ దృఢవిశ్వాసంతో ఉంది. కర్ణాటక (4), మహారాష్ట్ర (6), హరియాణా (2), రాజస్థాన్ (4)ల్లో 16 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సగం (8) కైవసం చేసుకుంది. వీటిలో రాజస్థాన్‌లో తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో ఒక్కో సీటు అదనంగా దక్కడం గమనార్హం. కాంగ్రెస్ 5, దాని మిత్రపక్షాలు 3 సీట్లు గెలుచుకుని బీజేపీతో సమానంగా నిలిచినప్పటికీ.. హరియాణాలో మాత్రం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Also Read: Tadipatri Tensions: తాడిపత్రిలో వైసీపీ దౌర్జన్యకాండ.. పోలీసుల ఎదుటే దాడులు
రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యూహ ప్రతివ్యూహాలు జోరందుకుంటున్నాయి. ‘విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలి’ అని కాంగ్రెస్ భావిస్తుండగా… ‘మా అభ్యర్థి గెలుపు ఖాయం. కానీ… ఘన విజయం సాధించడమే మా లక్ష్యం’ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇరుపక్షాలు కసరత్తు చేస్తున్నా యి. ‘ఉమ్మడి అభ్యర్థి’ ఎంపికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రతిపక్షాలతో మంతనాలు ప్రారంభించారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాకరేలతో స్వయంగా మాట్లాడారు. ఆమె సూచనల మేరకు పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో చర్చలు జరిపారు. త్వరలో ఉద్ధవ్ ఠాకరేతోపాటు… డీఎంకే, తృణమూల్, వామపక్ష నాయకులను కలుస్తానని, వారితో సమావేశానికి తేదీలను నిర్ణయిస్తామని ఖర్గే తెలిపారు.

మరోవైపు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రయత్నాలను మొదలు పెట్టారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ కలుద్దామని ముహుర్తం ఖరారు చేశారు. ఢిల్లీలో ఈ నెల 15న జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్‌ను మమత బెనర్జీ ఆహ్వానించారు. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహా 22 మంది జాతీయ నేతలకు మమత లేఖ రాశారు. సోనియా గాంధీకి కూడా మమతా బెనర్జీ ఆహ్వానం పంపారు. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా విపక్షాలను బెంగాల్ సీఎం కూడగడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో బలమైన ప్రత్యర్థిని బరిలో నిలిపేందుకు మమత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 15న ఢిల్లీలో నిర్వహించే భేటీకి 22 మంది నేతలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్ సీఎంలతో పాటు పలువురి ప్రముఖులకు లేఖలు రాశారు .
Also Read:AP Liquor Issue: ఏపీలో మద్యం నిషేధం లేనట్టే.. లిఖితపూర్వకంగా తెలిపిన జగన్ సర్కారు