
Kcr: ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ఈ సమయంలో గుణాత్మక మార్పు అవసరం.. ఆ మార్పు తీసుకొచ్చేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి.. అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా నేషనల్ లెవల్లో చక్రం తిప్పేందుకు కొత్త పార్టీ పెడుతున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఇటీవల ప్రగతి భవన్ లో అత్యవసర మీటింగ్ అరేంజ్ చేసిన కేసీఆర్ కొత్త పార్టీ గురించి చర్చించారు. మంత్రులు, ఎంపీల అభిప్రాయం తెలుసుకున్నారు. అందుకు వారు సరేననండంతో ఈనెల 19న పార్టీపై ఫైనల్ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ కొత్త పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి(BRS) అని పేరు పెట్టాలనుకున్నారు. కానీ తాజాగా ఆయన వ్యూహం మార్చినట్లు సమాచారం. కొత్త పార్టీ కాకుండా ఇప్పుడున్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలని అనుకుంటున్నట్లు సమాచారం.
కేసీఆర్ వ్యూహం మారింది.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కొత్త పార్టీని పెట్టాలనుకున్న ఆయన ఉన్న పార్టీనే మార్పులు చేయాలని అనుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇప్పుడున్న పార్టీ జెండా, గుర్తు అవే ఉంచుతారట. అయితే తెలంగాణ చిత్రపటం స్థానంలో భారతదేశ పటాన్ని చేర్చాలని అనుకుంటున్నారట. మొన్నటి వరకు కొత్త పార్టీపై ఉన్న ఆలోచనని ఇప్పుడు ఉన్న పార్టీని మార్చి పేరులో కూడా మార్పులు చేయాలని అనుకుంటున్నారట. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (TRS) ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇదే పార్టీని ‘భారత్ రాజ్య సమితి’(BRS)గా మారుస్తారని తెలుస్తోంది. దేశంలోని రాష్ట్రాల సమాఖ్యను తెలిపేందుకు బీఆర్ఎస్ పేరు సరిపోతుందని కొందరు నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.
అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈనెల 19న పార్టీ నాయకులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ మార్పుపై సమీక్షించనున్నారు. ఆ తరువాత కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లనున్నట్లు సమాచారం. పార్టీ పూర్వ చరిత్ర ఆధారంగా జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే పార్టీ పేరు, గుర్తు, జెండా కలర్ గురించి నిపుణులను సంప్రదించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో పార్టీ సమావేశానికి ముందే గుర్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
దేశంలో ఇప్పటి వరకు చాలా ప్రాంతీయ పార్టీలు జాతీయ హోదాను పొందాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఐ, సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్, ఉన్నాయి. వీటిలో ఎన్సీపీ, ఎన్పీపీ, టీఎంసీలు ముందుగా ప్రాంతీయ పార్టీలుగా ఉండేవి. ఆ తరువాత జాతీయ హోదాను దక్కించుకున్నాయి. అయితే ఎన్సీపీ, ఎన్పీపీ పేర్లు మారలేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందు ‘అఖిల భారత’ అని చేర్చి జాతీయ పార్టీగా మారింది.
[…] Also Read: Kcr: కొత్త పార్టీ కాదు.. ఉన్న టీఆర్ఎస్ నే … […]