Modi NDA meeting : ఐదు సంవత్సరాల తర్వాత ఎన్డీఏ భేటీ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ పక్షాలు సమావేశమయ్యాయి. 39 పార్టీల అధినేతలతో మోడీ విస్తృతంగా మాట్లాడారు. పేరుపేరునా పలకరించారు.. అవినీతి, కుటుంబ పాలన, ప్రాంతీయ వాదంతో దేశంలోనే విపక్ష పార్టీలు ఒకటయ్యాయని, వారి ఆటలు సాగబోవని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సరే ఎన్డీఏ ఏర్పడిన 25 సంవత్సరాల తర్వాత.. ఈ భేటీ ఏర్పాటు చేశారు కాబట్టి.. ప్రతిపక్షాల మీద మోడీ విమర్శలు చేశారు, ప్రతిపక్షాలు కూటమి కట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ భేటీ వెనుక మోడీ భారీ ప్లాన్ ఉంది. అన్నింటికీ మించి 2024 రోడ్డు మ్యాప్ ఉంది.
26 పార్టీల్లో నిలబడేవి ఎన్ని?
వాస్తవానికి బెంగళూరు భేటికంటే ముందే ప్రతిపక్షాలు పాట్నాలో భేటీ అయ్యాయి. ఆ సమావేశానికి కొన్ని పార్టీలు హాజరు కాలేదు. ఆ సమావేశం పూర్తయిన తర్వాత కొంతమంది విపక్ష నాయకులు ఢిల్లీ ఆర్డినెన్స్ మీద కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎపిసోడ్ జరగడం, అక్కడి ప్రభుత్వంలోకి ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ వెళ్లిపోవడం జరిగాయి. ఈ పరిణామంతో నితీష్ కుమార్ ఆత్మ రక్షణలో పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్ రాష్ట్రంలోనూ బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీయడంతో నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలతో వరసగా సమావేశాలు నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో తాను విపక్ష పార్టీల కూటమికి నాయకత్వం వహించడం సరికాదని భావించి.. సోనియాగాంధీని ముందు వరుసలో నిలబెట్టారు. ఆమెకు ఇలాంటి కూటమి నిర్వహణ కొట్టినపిండి కాబట్టి, భారతీయ జనతా పార్టీ మరింత దూకుడుగా వెళ్తోంది కాబట్టి, దానికి కట్టడి వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమె రంగంలోకి దిగారు. అలా బెంగళూరు భేటీకి బీజం పడింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల ఐక్యతకు కూడా మోడీనే కారణమయ్యారంటే ఆశ్చర్యం అనిపించక మా నదు.
మళ్లీ లుకలుకలు
ప్రతిపక్షాల్లోని అనైక్యతే తన బలంగా మోదీ మార్చుకుంటూ వచ్చారు, ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. ప్రతిపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. ఇక ఇదే సమయంలో ఎన్డీఏ కూటమి తన ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని దాదాపు ప్రకటించింది. బహుశా ఆ పార్టీల్లో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని అభ్యర్థిగా నిలిచేవారు లేకపోవడం ఆ కూటమికి సానుకూల అంశం. కానీ ఇదే విపక్ష కూటమికి వచ్చేసరికి అందులో అందరూ కూడా ప్రధాని అభ్యర్థులుగా పేరు ప్రకటించుకుంటున్నారు. మంగళవారం జరిగిన భేటీలో మల్లికార్జున ఖర్గే ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అని చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆ ప్రస్తావన ఆగిపోయింది. మరోవైపు కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పేరు ప్రతిపాదించాలని హడావిడి చేశారు. అయితే వారి హడావిడి చూసి తృణ మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఒకింత ఆగ్రహంగా చూడడంతో వారు సైలెంట్ అయిపోయారు. ఇక ఇలాంటి పరిణామాలను మీడియా వెలుగులోకి తీసుకు రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిసాయి.
ఇక ప్రతిపక్ష పార్టీల నాయకుల్లో ఒకవేళ పొత్తులు కుదిరితే వారి వారి రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనేది అందుపట్టకుండా ఉంది. సరిగ్గా ఇలాంటి లోపమే ప్రధానమంత్రి మోడీకి మరోసారి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధానాన్ని సరిగ్గా అంచనా వేసిన మోడీ తనకు ఇబ్బందులు లేకుండా ఉండడానికే ఎన్ డి ఏ కూటమి సమావేశం ఏర్పాటు చేశారని వారు అంటున్నారు. కొన్ని సెక్షన్లు ప్రతిపక్షాల కూటమికి భయపడి మోడీ సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు. అయితే దీనిలో వాస్తవం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి కంటే విపక్షాలు ముందుగానే వరుస భేటీలు నిర్వహించినప్పటికీ కీలక అంశాలలో ఇప్పటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. మరోవైపు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఇంతవరకూ ప్రకటించలేదు. ఇదే సమయంలో ఎన్డీఏ దాదాపు అన్ని విషయాల్లో ఒక ఏకాభిప్రాయానికి వచ్చింది. మరోమారు భేటీలో సీట్ల పంపకం పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించారు. అయితే ఎన్డీఏ కూటమికి భిన్నంగా ఆలోచించి ప్రణాళికలు అమలు చేయాల్సిన ఇండియా కూటమిలో కీలక నేత ఆయిన నితీష్ కుమార్ ఆ కూటమి పేరే సరిగా లేదని ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రకారం మోడీ వేసిన పాచిక పారినట్టే కనిపిస్తోంది.