Delhi Election Results : మొత్తానికి బీజేపీ దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ రాజధానిని దక్కించుకుంది. తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 సీట్లు గెలుచుకున్నాయి. ఇక కేజ్రీవాల్ ఓడిపోవడం ఆప్ పార్టీకి ఘోర పరాభవంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఢిల్లీ ఎన్నికల ప్రచార సందర్భంలో స్టేజీపై ఉండగా ఒక బీజేపీ అభ్యర్థి వచ్చి కాళ్లు మొక్కుతారు. వెంటనే ప్రధాని మోదీ కూడా ఆ అభ్యర్థి కాళ్లు మొక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. మరోసారి ఆయన పేరు సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. ఆ అభ్యర్థి గెలిచాడా? ఓడిపోయాడా? అని తెగ చర్చలు పెడుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి ఘన విజయం సాధించారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి అవధ్ ఓజాను 23,280 ఓట్ల తేడాతో ఓడించారు. గత మూడు ఎన్నికలుగా ఈ స్థానం ఆప్ కైవసం చేసుకుంటూ వచ్చింది. 2020 ఎన్నికల్లో మనీష్ సిసోడియా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఆ ఎన్నికల్లో రవీంద్ర నేగి కేవలం 2శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు.
మనీష్ సిసోడియా ఓటమి
ఈసారి ఎన్నికల్లో మనీష్ సిసోడియా పట్పర్‌గంజ్ స్థానాన్ని వదిలి జంగ్‌పురా నుంచి పోటీ చేశారు. అయితే, ఆయన అక్కడ కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో పట్పర్‌గంజ్ స్థానం గట్టిపోటీ అనంతరం బీజేపీ చేతికి వెళ్లింది. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోటీ జరిగినప్పటికీ చివరికి రవీంద్ర సింగ్ నేగి విజయం సాధించారు.
మోదీ రవీంద్ర సింగ్ నేగి అనుబంధం
ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ బహిరంగ సభలో రవీంద్ర సింగ్ నేగి పాదాలకు నమస్కరించిన వీడియో వైరల్ అయ్యింది. ర్యాలీలో రవీంద్ర నేగి మోడీ పాదాలను తాకగా, మోదీ తిరిగి ఆయనను ఆపి మూడుసార్లు స్వయంగా ఆయన పాదాలను తాకారు. ఈ సంఘటన బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రవీంద్ర సింగ్ నేగి ఎవరు?
రవీంద్ర సింగ్ నేగి ప్రస్తుతం పట్పర్‌గంజ్ పరిధిలోని వినోద్ నగర్ నుండి ఎంసీడీ కౌన్సిలర్‌గా ఉన్నారు. ఆయన ఉత్తరాఖండ్ మూలానికి చెందినవారు. ఢిల్లీలో ఉత్తరాఖండ్ వాసులు సుమారు 25 లక్షల మంది ఉండగా, వారిలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. రవీంద్ర నేగికి ఈ వర్గం మద్దతుగా నిలిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
ఆస్తి వివరాలు
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రవీంద్ర సింగ్ నేగి వయస్సు 48 సంవత్సరాలు. ఆయన విద్యార్థి స్థాయిలో గ్రాడ్యుయేట్. నికర ఆస్తి విలువ రూ. 1.8 కోట్లు కాగా, అప్పు రూ. 16 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రాధాన్యత
ఈ ఎన్నికల్లో ఆప్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత పదేళ్లుగా పట్పర్‌గంజ్ నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యంలో ఉండగా, ఇప్పుడు అది బీజేపీ చేతికి మారడం ముఖ్య రాజకీయ పరిణామంగా మిగిలింది. ఈ విజయం బీజేపీకి ఢిల్లీలో మరింత బలం పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
VIDEO | Delhi Elections 2025: PM Modi (@narendramodi) meets BJP candidates during ‘Sankalp Rally’ at Kartar Nagar.#DelhiElectionsWithPTI #DelhiElections2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/H3sM0z63h3
— Press Trust of India (@PTI_News) January 29, 2025