many reasons for AAP's defeat
Delhi Election Results హస్తిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార ఆప్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఫలితాలు ఆప్ నాయకులను మాత్రమే కాదు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ ఓటమికి ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుని నిర్ణయాలు దోహదం చేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
షీష్ మహల్
ఆప్.. సామాన్యుల పార్టీగా మొదట్లో వెలుగులోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ కూడా తన రాజకీయ జీవితాన్ని ఆమ్ ఆద్మీ అనే నినాదంతో మొదలుపెట్టారు. మామూలు కాటన్ షర్ట్, ప్యాంట్ ధరించే అరవింద్ కేజ్రీవాల్.. చిన్న ఫ్లాట్, సాధారణ కారులో ప్రయాణ మొదలుపెట్టారు. ఇది ప్రజల్లో ఆయనకు ఆదరణ పెరిగేలా చేసింది. కానీ ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారి గా మారిపోయాడు. 40 కోట్ల రూపాయల విలువైన షీష్ మహల్ నిర్మాణం.. ఇంకా అనేక అంశాలు ఆప్ పై ఢిల్లీ ఓటర్లలో ఆగ్రహాన్ని పెంచాయి..తన పార్టీ కోసం ప్రజలు పనిచేయాలని అరవింద్ కేజ్రీవాల్ పదేపదే చెప్పేవారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది.. వ్యక్తిగత ఆడంబరాలకు, హంగామాకు అరవింద్ కేజ్రీవాల్ ప్రాధాన్యం ఇవ్వడంతో ఢిల్లీ ప్రజల మనోగతం ఒక్కసారి గా మారిపోయింది.
లిక్కర్ కుంభకోణం
కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమం చేశారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ పేరు వెలుగులోకి వచ్చింది.. ఈ కేసును తప్పిపుచ్చుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించారు. కానీ తాను నిర్దోషినని చెప్పుకోలేదు.. మద్యం సీసాలు ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే కొత్త విధానాన్ని అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి తీసుకొచ్చారు. ఇది ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఢిల్లీని మద్యపాన ప్రియుల నగరంగా మారుస్తోంది అనే ఆరోపణలు వినిపించాయి. ఫలితంగా పార్టీపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడం మొదలైంది.
యమునా నది కాలుష్యం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ పదేపదే యమునా నది కాలుష్యంపై మాట్లాడారు. యమునా నదిని శుభ్రం చేస్తానని వాగ్దానం చేశారు. 2015లో ఆప్ మేనిఫెస్టోలో యమునా నదిని 100% శుభ్రం చేస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు దానిని నిలబెట్టుకోలేదు. ఇక ఇవే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ అనేక వాగ్దానాలు ఇచ్చారు. వాటిని అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. అందువల్లే ఆయన ఓటర్లలో విశ్వసనీయతను కోల్పోయారు. 2013లో కాంగ్రెస్, బిజెపికి ప్రత్యామ్నాయంగా ఆప్ ఆవిర్భవించింది.. ఆ సమయంలో కొన్ని వాగ్దానాలను అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చాడు. ఉచిత పథకాలు కొన్ని తప్ప మిగతావేవీ అమలు కాలేదు. నీటి కనెక్షన్లు ఇవ్వలేదు. వాయు కాలుష్యాన్ని తగ్గించలేదు. ఇవి మాత్రమే కాదు, మిగతా వాగ్దానాలు కూడా నెరవేరలేదు.. గోవా , గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ భారీగా డబ్బు ఖర్చు పెట్టారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై వచ్చిన ఆరోపణలకు ఆయన ఇచ్చిన సమాధానాలు కూడా అంత స్పష్టంగా లేవు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఆప్ పై ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. 2015 నుంచి 2020 వరకు ఢిల్లీలో ఆప్ అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ.. మొదటి రెండు పర్యాయాలు మాత్రమే ఆరోగ్యం, విద్య వంటి రంగాలపై ఆప్ మెరుగైన పనితీరు కనబరిచింది. మూడో పర్యాయం మాత్రం అనేక ఆరోపణలలో కూరుకుపోయింది.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరకపోవడం అంతిమంగా ఆప్ ఓటమికి కారణమైంది.