Teenmar Mallanna
Teenmar Mallanna : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆ పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆయన కుదురుగా ఉండరు అనే విమర్శలు ఉన్నాయి. గతంలో బీజేపీ(BJP)లో చేరిన ఆయన కేంద్రంపై విమర్శలు చేశారు. తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, టికెట్ రాలేదు. అయినా పార్టీ తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ(MLC) టికెట్ ఇచ్చి గెలిపించారు. ఎమ్మెల్సీగా కొంత కాలం స్తబ్ధుగానే ఉన్న ఆయన సడెన్‌గా బీసీ గలం ఎత్తుకున్నారు. అధికార పార్టీలోనే ఉంటే.. ఆ పార్టీనే ఇబ్బంది పెట్టేలా వ్వవహరిస్తున్నారు. తాజాగా వరంగల్‌లో జరిగిన బీసీల సదస్సులో రెడ్డి సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దుర్భాలసాడారు. దీంతో సిద్దిపేటకు చెందిన కె.అరవింద్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేయని పోలీసులు..
అరవింద్‌రెడ్డి(Aravind reddy) ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదు. దీంతో డీజీపీ, పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేశాడు. అయినా వారు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు.. కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈనెల 21లోపు వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 21 వ తేదీకి వాయిదా వేసింది.
బీసీ కుల గణనపైనా విమర్శలు..
తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనను కూడా తప్పు పట్టారు. కులగణను తప్పుల తడక అని విమర్శించారు. పార్టీ ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్సీ హోదాలో ఉండి పార్టీ నాయకత్వం, ప్రభుత్వం నిర్వహించిన సర్వేపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్‌కు ఇంటా–బయట కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్సీ తీరుపై పీసీసీ సీరియస్ అయింది. ఈమేరకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. టైం బాండ్ పెట్టి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫిబ్రవరి 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సూచించింది. వరంగల్ సభలో ఒక కులాన్ని ధూషించడంపైనా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే నోటీసులను కూడా తీన్మార్ మల్లన్న తప్పు పట్టారు. గణనను తప్పు పట్టిన ఆయన తనకు కాకుండా గణన చేసిన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. ఇక నోటీసులకు సమాధానం ఇవ్వాలా వద్దా అనేది బీసీ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.