PM Modi Visit Warangal: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్ వచ్చేసారు. మామునూరులో ఆర్మీ విమానంలో దిగిన ఆయన నేరుగా భద్రకాళి గుడికి వెళ్లారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోడీ రాకతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్వేగ వాతావరణం నెలకొంది. అక్కడ శాకంబరి దేవిగా ముస్తాబైన అమ్మవారిని చూసి తన్మయత్వానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను ప్రధానమంత్రి మోడీకి అర్చకులు వివరించారు. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం శక్తిపీఠంగా భాసిల్లుతోందని మోడీకి చెప్పారు.. దాదాపు 30 సంవత్సరాల తర్వాత దేశ ప్రధాని వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎస్పీజీ బృందాలు వరంగల్ నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వరంగల్ నగరాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాయి. 20 కిలోమీటర్ల పరిధి మేరకు రాకపోకలను దాదాపుగా నిషేధించాయ.
భద్రకాళి దర్శనం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానానికి చేరుకున్నారు. అక్కడ నిర్వహించే విజయ సంకల్ప సభకు హాజరయ్యారు. అక్కడ జరగనున్న సభలో మోదీ మాట్లాడారు.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గిరిజన యూనివర్సిటీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే తమ హామీలు ఇవ్వబోమని, తెలంగాణ తమ దృష్టిలో ఐకానిక్ మోడల్ అని ప్రకటించారు. త్యాగాల గడ్డమీద ఏర్పడిన ఈ రాష్ట్రమంటే తమకు ఎంతో ఇష్టమని మోడీ ప్రకటించారు. ఇక్కడి చారిత్రాత్మక వారసత్వం నన్ను ఎంతగానో కట్టిపడేసిందని మోడీ చెప్పుకొచ్చారు. వేదిక మీద కేవలం 7గురుకి మాత్రమే అవకాశం ఇచ్చిన ఈ సభలో ప్రధానమంత్రి మోడీ వెంట కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, నాయకులు ఉన్నారు.
ఇక వరంగల్ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “చారిత్రాత్మకమైన వరంగల్ కు చేరుకోబోతున్నాను. అక్కడ పలు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నాను. వీటి విలువ 6,100 కోట్లు.” అని ట్వీట్ ద్వారా తెలిపారు.. ఈ అభివృద్ధి పనులు వివిధ విభాగాల్లో అంటే హైవే నుంచి రైల్వేస్ వరకు ఉంటాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ అభివృద్ధి పనులు తెలంగాణ ప్రజానీకానికి చాలా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా మోడీ పర్యటన నేపథ్యంలో వరంగల్ నగరం మొత్తం కాషాయంగా మారిపోయింది. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లతో నగరం మొత్తం నిండిపోయింది. కొద్దిరోజులుగా అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన బూస్ట్ ఇస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
Leaving for Warangal to attend a programme where we will inaugurate or lay the foundation stone for development works worth over Rs. 6100 crores. These works cover different sectors ranging from highways to railways. They will benefit the people of Telangana.
— Narendra Modi (@narendramodi) July 8, 2023