Prime Minister Narendra Modi : ప్రపంచంలో ఎక్కడ ఏ వివాదమైనా, నిర్ణయమైనా భారత్ చొరవ లేకుండా ముందుకు కదలడం లేదు. ఈ విషయాన్ని గతంలో జరిగిన సమ్మిట్ లలో విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. నేడు భారత్ ప్రపంచం గర్వించే దేశంగా ఉందన్న ఆయన ప్రపంచలోని ఇతర దేశాల్లో శాంతి, సౌభ్రాతృత్వం కోసం భారత్ పని చేస్తుందన్నారు. యుద్ధాలు తమ వైఖరి కాదని భారత్ ఎప్పుడూ స్పష్టం చేస్తుందని, రష్యా-ఉక్రెయిన్ సమస్యపైనా తమ వైఖరి శాంతిని కోరుకోవడమేనని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మూడు రోజులు పోలాండ్, ఉక్రెయిన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనతో ప్రపంచం యావత్ దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో, ఆ తర్వాత ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. “పీఎం డోనాల్డ్ టస్క్ ఆహ్వానం మేరకు ఈ వారం ఆగస్టు 21, 22 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్‌లో అధికారిక పర్యటన చేయనున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత్ చెందిన ప్రధాని పోలాండ్‌లో పర్యటించడంపై ఇరు దేశాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మా దౌత్య సంబంధాల స్థాపన 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సందర్శన జరిగింది’ అని MEA కార్యదర్శి (పశ్చిమ), తన్మయ లాల్ ఒక బ్రీఫింగ్‌లో తెలిపారు. ప్రధాని ఉక్రెయిన్ పర్యటనపై MEA అధికారి మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారం చివరలో శుక్రవారం, ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌లో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఇది కూడా ఒక మైలురాయి, చారిత్రాత్మక పర్యటన. దౌత్య సంబంధాలను నెలకొల్పిన 30 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి.
ఉక్రెయిన్ వివాదానికి పరిష్కారం దొరుకుతుందా?
G7 సమ్మిట్ సందర్భంగా ఇటలీలో ప్రధాన మంత్రి జెలెన్స్కీని కలిశారు ప్రధాని మోడీ. గత నెలలో మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాస్కోలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ వివాదంపై భారత వైఖరిని MEA పునరుద్ఘాటించింది. ‘దౌత్యం, సరస్పర చర్చలతో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరినట్లు చెప్పారు. శాంతి కోసం భారతదేశం చాలా స్పష్టమైన, స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంది. రెండు దేశాలకు ఆమోద యోగ్యమైన సూచనలతోనే శాంతి చేకూరుతుంది’ అని లాల్ బ్రీఫింగ్‌లో తెలిపారు.
‘మా వంతుగా, భారతదేశం అన్ని వాటాదారులతో పరస్పర చర్చ కొనసాగిస్తోంది. మీకు తెలిసినట్లుగానే రష్యా, ఉక్రెయిన్ నాయకులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇటీవలే మోడీ రష్యాను సందర్శించారు’ అని ఆయన అన్నారు. ‘ఈ సంక్లిష్ట సమస్యకు శాంతియుత పరిష్కారం కల్పించడంలో సాయం చేసేందుకు అవసరమైన మద్దతు, సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఈ దశలో, భారత్, ఉక్రెయిన్ మధ్య ఈ చర్చల ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం లేదంటే ముందస్తు అంచనా వేయడం మా వల్ల కాదు’ అని లాల్ అన్నాడు.