Homeజాతీయ వార్తలుNarendra Modi: మోడీ ఆగ్రహం..దిగొచ్చిన గూగుల్.. మెగా ప్రొడ్యూసర్ హ్యాపీ

Narendra Modi: మోడీ ఆగ్రహం..దిగొచ్చిన గూగుల్.. మెగా ప్రొడ్యూసర్ హ్యాపీ

Narendra Modi: ఆ మధ్య మనం చెప్పుకున్నాం కదా.. ఓ మెగా ప్రొడ్యూసర్ కు సంబంధించిన ఓటీటీ ని ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించిందని.. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆ మెగా ప్రొడ్యూసర్ తల పట్టుకున్నాడని.. అంతేకాదు ఆ ఓటీటీ సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సాంకేతిక కారణాలవల్ల ఇబ్బంది కలుగుతోందని, ఇందుకు చింతిస్తున్నామని సబ్ స్క్రైబర్లతో వాపోయింది. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. పేరుకైతే అలా ప్రకటించింది కానీ ఆ సమస్యకు పరిష్కారం తన చేతిలో లేదని కూడా ఆ సంస్థకు తెలుసు. కానీ అలా చెప్పక తప్పదు..

వాస్తవానికి సదరు మెగా ప్రొడ్యూసర్ అప్పటికే మరికొన్ని సంస్థలతో కలిసి గూగుల్ పై సుప్రీంకోర్టులో పోరాడుతున్నాడు. ఆ కేసు తీర్పు రాకముందే గూగుల్ ఆ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. సర్వీసు రుసుము చెల్లిస్తేనే ప్లే స్టోర్ లో ఉంచుతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గూగుల్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ స్టార్టప్ కంపెనీల యాప్ లను తొలగించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యను తాము ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా స్వీకరించలేమని అన్నారు. ప్రధాని అలా ప్రకటించిన వెంటనే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.”ఆర్థిక వ్యవస్థలో స్టార్టప్ రంగం మాకు అత్యంత కీలకం. వాటి భవితవ్యాన్ని ఒక సాంకేతిక సంస్థ చేతికి వదిలిపెట్టలేం. అవసరమైతే స్టార్టప్ లకు అండగా నిలుస్తామని” ప్రకటించడంతో ఆ మెగా ప్రొడ్యూసర్ ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎందుకంటే ఆయన కోవిడ్ కంటే ముందు ఏర్పాటుచేసిన ఓటీటీ సంస్థ నష్టాల్లో ఉంది. దానిని అమ్మాలని ఈ మధ్య ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే బేరం కుదరడం లేదు. అందువల్లే ఆ ప్రక్రియ ఆగిపోతోంది.

మరోవైపు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ ను తొలగించిన నేపథ్యంలో సోమవారం ఆ కంపెనీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా ఇటీవల గూగుల్ సంస్థ పది యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ముస్లిం మాట్రిమోనీ, ఇన్ఫో ఎడ్జ్ కు చెందిన జీవన్ సాథి, క్రిస్టియన్ మాట్రిమోనీ, భారత్ మాట్రిమోనీ, నౌకరి, నౌకరి రిక్రూటర్, నౌకరీ గల్ఫ్, శిక్ష యాప్, 99 ఎకర్స్, ఆహా వంటి వాటిని తొలగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరికలతో మళ్లీ వాటిని గూగుల్ ప్లే స్టోర్లో పునరుద్ధరించింది. అయితే గూగుల్ సర్వీస్ రుసుములు వసూలు చేయడాన్ని మ్యాట్రిమోనీ డాట్ కాం, ఇన్ఫో ఎడ్జ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా వంటి సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ప్రస్తుతం ఈ కేసు కు సంబంధించి త్వరలో విచారణ జరగనుంది. కాగా, ఇప్పటికే గూగుల్ ప్రకటనల ఆదాయంలో వివక్ష చూపుతోందని మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన కొన్ని మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఆ సంస్థలు అక్కడి కోర్టును ఆశ్రయించగా.. గూగుల్ సంస్థకు భారీగా జరిమానా విధించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular