Kodali Nani Vs Nara Rohit
Kodali Nani Vs Nara Rohit: కొడాలి నాని పై సరైన ‘బాణం’ను విడిచిపెడుతున్నారా? గుడివాడ తెరపైకి సరైన ‘ప్రతినిధి’ రానున్నారా? చంద్రబాబు అదే ప్రయత్నంలో ఉన్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు తన తమ్ముడు కుమారుడు నారా రోహిత్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురానున్నారన్న టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నారా రోహిత్ ప్రస్తుతం సినీ రంగంలో ఉన్నారు. హీరోగా కొనసాగుతున్నారు. బాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపబడ్డారు. ప్రతినిధి సినిమాలో సమకాలిన రాజకీయ అంశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే హీరోగా సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఆయన చూపు రాజకీయాల వైపు పడిందని ప్రచారం జరుగుతోంది.
2024 ఎన్నికల్లో రోహిత్ గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఎంత ఆవశ్యమో.. గుడివాడలో కొడాలి నాని ఓటమి కూడా అత్యంత ఆవశ్యంగా టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలో దించాలని కోరుతున్నాయి. గత కొంతకాలంగా అభ్యర్థిని అన్వేషించే పనిలో ఉన్న చంద్రబాబు.. నారా రోహిత్ పేరును పరిగణలో తీసుకున్నట్లు సమాచారం.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో గుడివాడ నియోజకవర్గం టిడిపికి కంచుకోట. దివంగత నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం. 1983, 1985లో రెండుసార్లు ఇక్కడి నుంచి ఎన్టీఆర్ గెలుపొందారు. 1989 లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 1994 నుంచి 2009 వరకు టిడిపి యే ఇక్కడ విజేత. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని గెలుపొందుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే గెలుపు అని సౌండ్ చేస్తున్నారు. తనపై చంద్రబాబు, లోకేష్ లు పోటీ చేసి గెలవాలని తరచూ సవాల్ చేస్తున్నారు. అందుకే చంద్రబాబు గుడివాడ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
తొలుత నందమూరి వంశం నుంచి ఎవరినో ఒకరిని బరిలో దించాలని భావించారు. దివంగత తారకరత్నతో పోటీ చేయించడానికి దాదాపు డిసైడ్ అయ్యారు. ఆయన అకాల మరణంతో మరో అభ్యర్థి అన్వేషణ అనివార్యంగా మారింది. ఈ తరుణంలో నారా రోహిత్ అయితే సరైన అభ్యర్థి అవుతారని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి తన దృష్టి అంత సినిమాలపైనేనని.. అవసరమైతే పార్టీకి తప్పకుండా సేవలందిస్తానని రోహిత్ చెబుతున్నారు. పెదనాన్న చంద్రబాబు మాటే శిరోధార్యంగా చెప్పుకొస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గుడివాడ టిడిపి అభ్యర్థిగా రోహిత్ రంగంలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.